Telangana: కామారెడ్డి, వికారాబాద్ సహా పలు ప్రాంతాల్లో వడగండ్ల వాన

- మొక్కజొన్న సహా దెబ్బతిన్న వివిధ పంటలు
- భారీ వర్షం కురవడంతో విద్యుత్ నిలిపివేత
- పలు జిల్లాల్లో మోస్తరు వర్షం
తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. కామారెడ్డి జిల్లాలో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. గాంధారి మండలం చద్మాల్ తండా, నేరల్ తండా, గుర్జాల్ గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. ఈ వడగండ్ల వాన కారణంగా మొక్కజొన్న పంటతో సహా ఇతర పంటలు కూడా దెబ్బతిన్నాయి. వర్షం కారణంగా పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
వికారాబాద్ నియోజకవర్గం పరిధిలోని మోమిన్‌పేట, నవాబుపేట మండలాల్లో కూడా వడగండ్ల వాన కురిసింది. ఈదురుగాలులు వీయడంతో నవాబుపేట మండలం చిట్టిగిద్ద గ్రామ సమీపంలో ఒక భారీ వృక్షం నేలకూలింది. దీని కారణంగా కొంతసేపు రాకపోకలు నిలిచిపోయాయి. సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్‌లోనూ వడగండ్ల వర్షం కురిసింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షం కురిసింది.