Harish Rao: ఎస్ఎల్‌బీసీ సొరంగం ఘటన... ప్రభుత్వంపై హరీశ్ రావు ఘాటు విమర్శలు

Harish Rao Condemns Govts Response to SLBC Tunnel Tragedy

  • సొరంగంలో చిక్కుకుపోయిన వారిని తలుచుకుంటే గుండె తరుక్కుపోతుందన్న హరీశ్ రావు
  • సహాయక చర్యల్లో జాప్యం ఎందుకు జరుగుతోందని నిలదీత
  • నెల రోజులు గడుస్తున్నా... ఏడుగురు ఏమయ్యారో తెలియని పరిస్థితి అని ఆవేదన

పొట్టకూటి కోసం వచ్చి ఎస్ఎల్‌బీసీ సొరంగంలో చిక్కుకుపోయిన వారిని తలుచుకుంటే గుండె తరుక్కుపోతుందని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. సహాయక చర్యల్లో ఎందుకింత జాప్యం జరుగుతోందని ఆయన ప్రశ్నించారు. 

నెల రోజులు గడుస్తున్నా... సొరంగంలో చిక్కుకుపోయిన వారు ఏమయ్యారో తెలియని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక కార్మికుడి మృతదేహం వెలికితీయడం తప్ప మిగిలిన ఏడుగురి జాడ గుర్తించలేకపోయారని విమర్శించారు.

సహాయక చర్యలు ఆలస్యం కావడంలో ప్రభుత్వ వైఫల్యం కూడా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఎల్‌బీసీ ప్రమాదానికి, బాధిత కుటుంబాలు అనుభవిస్తున్న తీవ్ర ఆవేదనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. సొరంగంలో చిక్కుకుపోయిన మిగిలిన కార్మికుల పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రావాలని డిమాండ్ చేశారు.

ఎస్ఎల్‌బీసీ సహాయక చర్యల విషయంలో మంత్రులు చెప్పిన గడువు ముగిసిందని హరీశ్ రావు అన్నారు. కానీ సహాయక చర్యల్లో మాత్రం ఎలాంటి పురోగతి కనిపించలేదని మండిపడ్డారు. ఈ ఘటనపై ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. ప్రమాదం జరిగినప్పటి నుంచి ఈ నెల రోజులుగా చేపట్టిన సహాయక చర్యలపై పూర్తి వివరాలు వెల్లడించాలని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News