DGGI: ఇల్లీగల్ గేమింగ్ సైట్లపై కొరడా ఝళిపించిన డీజీజీఐ

- జీఎస్టీ ఎగవేతకు పాల్పడుతున్న గేమింగ్ సైట్లు
- డీజీజీఐ రాడార్ పరిధిలో 700 గేమింగ్ సైట్లు
- తాజాగా 357 సైట్లను బ్లాక్ చేసిన కేంద్రం
జీఎస్టీ ఎగవేతకు పాల్పడుతున్న అక్రమ విదేశీ ఈ-గేమింగ్ వెబ్‌సైట్‌లపై కేంద్రం కొరడా ఝళిపించింది. 357 అక్రమ గేమింగ్ సైట్లను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ) బ్లాక్ చేసింది.
సుమారు 700 విదేశీ ఈ-గేమింగ్ సంస్థలు డీజీజీఐ స్కానర్ పరిధిలో ఉన్నాయి.ఈ సంస్థలు రిజిస్టర్ చేయడంలో విఫలం కావడం, పన్ను పరిధిలోకి వచ్చే చెల్లింపులను దాచిపెట్టడం, పన్ను బాధ్యతలను తప్పించుకోవడం ద్వారా జీఎస్టీ ఎగవేతకు పాల్పడుతున్నట్టు గుర్తించారు.
లావాదేవీలను ప్రాసెస్ చేయడానికి ఈ విదేశీ సంస్థలు తప్పుడు బ్యాంక్ ఖాతాల ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు దర్యాప్తులో తేలిందని డీజీజీఐ తెలిపింది. ఈ క్రమంలో 166 తప్పుడు బ్యాంకు ఖాతాలను కూడా బ్లాక్ చేసింది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సమన్వయంతో డీజీజీఐ ఇప్పటివరకు 357 వెబ్‌సైట్‌లు/యూఆర్ఎల్ లను బ్లాక్ చేసింది.
గేమింగ్ సైట్లకు సంబంధించి మరో రెండు వేర్వేరు కేసుల్లో డీజీజీఐ దాదాపు 2,400 బ్యాంకు ఖాతాలను బ్లాక్ చేసి, దాదాపు రూ.126 కోట్లను స్తంభింపజేసింది.