Revanth Reddy: పన్నుల రూపంలో భారీగా చెల్లిస్తున్నప్పటికీ తక్కువ మొత్తంలో తిరిగి పొందుతున్నాం: రేవంత్ రెడ్డి

Revanth Reddy Condemns Lok Sabha Delimitation

  • జనాభా ఆధారిత పునర్విభజనను వ్యతిరేకిస్తున్నామన్న రేవంత్ రెడ్డి
  • పారదర్శకంగా లేని ఈ విధానంపై బీజేపీని కట్టడి చేయాల్సిన అవసరం ఉందన్న సీఎం
  • ఉత్తరాది రాష్ట్రాల ఆధిపత్యాన్ని అంగీకరించబోమన్న ముఖ్యమంత్రి

పన్నుల రూపంలో కేంద్ర ప్రభుత్వానికి భారీగా చెల్లిస్తున్నప్పటికీ తక్కువ మొత్తంలో తిరిగి పొందుతున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్రం ప్రతిపాదించిన లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనను వ్యతిరేకిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. డీఎంకే ఆధ్వర్యంలో చెన్నైలో నిర్వహించిన అఖిల పక్ష సమావేశానికి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అభివృద్ధిలో ముందున్న రాష్ట్రాలకు రాజకీయపరమైన పరిమితులు విఘాతం కలిగిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు.

నియోజకవర్గాల పునర్విభజన రాష్ట్రాల మధ్య రాజకీయ అసమానతకు దారితీస్తుందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. పారదర్శకంగా లేని ఈ విధానంపై బీజేపీని నిలువరించాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. లోక్‌సభ సీట్లను పెంచకుండా రాష్ట్రాల్లో అంతర్గత నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని డిమాండ్ చేశారు. గతంలో 1976లో సీట్లను పెంచకుండానే నియోజకవర్గాల పునర్విభజన చేపట్టారని గుర్తు చేశారు.

జనాభా ఆధారిత పునర్విభజన ప్రక్రియను దక్షిణాది రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. జనాభా ప్రాతిపదికన పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాధాన్యం తగ్గుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దక్షిణాదిని ఉత్తరాది రాష్ట్రాలు ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణించే ప్రమాదం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజనను ఆమోదించవద్దని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఉత్తరాది రాష్ట్రాల ఆధిపత్యాన్ని అంగీకరించబోమని ఆయన తేల్చి చెప్పారు.

తెలంగాణ వేగవంతమైన ఆర్థికాభివృద్ధిని సాధించిందని, జీఎస్డీపీ, తలసరి ఆదాయంలో వృద్ధిని నమోదు చేసిందని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో సుపరిపాలనతో పాటు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. పన్నుల రూపంలో కేంద్రానికి భారీగా చెల్లింపులు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. రూపాయి చెల్లిస్తే తెలంగాణకు 42 పైసలు, తమిళనాడుకు 26 పైసలు, కర్ణాటకకు 16 పైసలు, కేరళకు 49 పైసలు మాత్రమే తిరిగి వస్తున్నాయని ఆయన తెలిపారు. అదే బీహార్‌కు రూ.6.06, ఉత్తరప్రదేశ్‌కు రూ.2.03, మధ్యప్రదేశ్‌కు రూ.1.73 మేర తిరిగి వస్తున్నాయని ఆయన వివరించారు.

  • Loading...

More Telugu News