Komatireddy Venkat Reddy: పీపీపీ విధానంలో రోడ్లను వేయడం లేదు: హరీశ్ రావుకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమాధానం

- హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో రహదారులు వేస్తున్నట్లు వెల్లడి
- పీపీపీ, హైబ్రిడ్ యాన్యుటీ విధానం రెండు వేర్వేరు అన్న మంత్రి
- శాసన సభలో హరీశ్ రావు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం
తెలంగాణ రాష్ట్రంలో తమ ప్రభుత్వం పీపీపీ విధానంలో రోడ్లు నిర్మించడం లేదని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో రహదారుల నిర్మాణం చేపడుతున్నామని ఆయన తెలిపారు. పీపీపీ, హైబ్రిడ్ యాన్యుటీ విధానాలు రెండూ వేర్వేరని మంత్రి పేర్కొన్నారు. శాసనసభలో మాజీ మంత్రి హరీశ్ రావు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు.
"మన సంపద మన రహదారులను నిర్మించదు, మన రోడ్లు మన సంపదను పెంచుతాయి" అని జాన్ ఎఫ్ కెనడీ చెప్పిన మాటలను ఆయన గుర్తు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో రూ. 112 కోట్లతో కేవలం 6,668 కిలోమీటర్ల రోడ్లను మాత్రమే మరమ్మతులు చేసిందని ఆరోపించారు. ఇది ప్రభుత్వ రికార్డు అని ఆయన వెల్లడించారు.
అంతేకాకుండా, రూ. 4,167 కోట్లు రుణం తీసుకున్నారని, ఆ అప్పులను తాము ఇప్పటికీ చెల్లిస్తున్నామని ఆయన అన్నారు. ఈ పద్నాలుగు నెలల్లో తాము రూ. 4 వేల కోట్లకు పైగా నిధులను రహదారుల కోసం మంజూరు చేశామని తెలిపారు. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్‌ను పద్దెనిమిది నెలల్లో పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. గత పదేళ్లలో రోడ్ల నిర్మాణానికి రూ. 3,945 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని ఆయన పేర్కొన్నారు.