Stalin: సొంత దేశంలోనే రాజకీయ అధికారాన్ని కోల్పోయిన పౌరులుగా మనం బతకాల్సి వస్తుంది: డీలిమిటేషన్ మీటింగ్ లో స్టాలిన్

- జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరగకూడదన్న స్టాలిన్
- మన సమ్మతి లేకుండానే పార్లమెంట్ లో చట్టాల రూపకల్పన జరుగుతుందని వ్యాఖ్య
- కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం మనం పోరాడాల్సి ఉంటుందన్న స్టాలిన్
జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంట్ లో చేసే చట్టాల రూపకల్పనలో ప్రాతినిధ్యం తగ్గుతుందని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేశారు. సొంత దేశంలోనే రాజకీయ అధికారాన్ని కోల్పోయిన పౌరులుగా మనం బతకాల్సి వస్తుందని చెప్పారు. డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా చెన్నైలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
డీలిమిటేషన్ పై నిర్వహించిన ఈ భేటీ చరిత్రలో నిలిచిపోతుందని స్టాలిన్ అన్నారు. ప్రస్తుత జనాభా ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరగకూడదని చెప్పారు. పార్లమెంట్ లో మన ప్రాతినిధ్యం తగ్గితే... మన అభిప్రాయాలను వ్యక్తపరిచే బలం తగ్గుతుందని అన్నారు. మన సమ్మతి లేకుండానే చట్టాల రూపకల్పన జరుగుతుందని చెప్పారు. మన ప్రమేయం లేకుండానే తీసుకునే నిర్ణయాలు మన ప్రజలపై ప్రభావం చూపుతాయని అన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రాలకు వచ్చే నిధుల కోసం మనం పోరాడాల్సి ఉంటుందని చెప్పారు. మన విద్యార్థులు అవకాశాలు కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. సామాజిక న్యాయం దెబ్బతింటుందని చెప్పారు. మన సాంప్రదాయాలు ప్రమాదంలో పడతాయని స్టాలిన్ అన్నారు.
దేశ జనాభాను తగ్గించాలన్న అప్పటి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని దక్షిణాది రాష్ట్రాలు సమర్థవంతంగా అమలు చేయడంతో... దక్షిణాది రాష్ట్రాల జనాభా ప్రస్తుతం తగ్గిపోయిందని స్టాలిన్ చెప్పారు. ఇదే సమయంలో ఉత్తరాదిన కొన్ని రాష్ట్రాల జనాభా భారీగా పెరిగిపోయిందని తెలిపారు. జనాభా నియంత్రణపై మన చర్యలకు ఎలాంటి రివార్డ్ రాలేదు సరికదా... ఇప్పుడు మనం రాజకీయ ప్రాతినిధ్యం కోల్పోయే ప్రమాదంలో పడ్డామని చెప్పారు.