Delimitation: తెలంగాణకు అర్ధ రూపాయి.. బీహార్ కేమో ఆరు రూపాయలా?: రేవంత్ రెడ్డి

- కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డ తెలంగాణ ముఖ్యమంత్రి
- ఉత్తరాది రాష్ట్రాలకు భారీగా నిధులు తిరిగిస్తోందని ఆరోపణ
- దక్షిణాది రాష్ట్రాలను చిన్నచూపు చూస్తోందని ఫైర్
కేంద్రంలోని ఎన్డీయే కూటమి సర్కారు దక్షిణాది రాష్ట్రాలను చిన్నచూపు చూస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి పెద్ద మొత్తంలో పన్నులు చెల్లిస్తోందని, తిరిగి పొందుతున్నది మాత్రం స్వల్పమేనని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం రూపాయి ఇస్తే, కేంద్రం కేవలం 42 పైసలు మాత్రమే తిరిగిస్తోందని విమర్శించారు. అదే బీహార్ కు మాత్రం రూపాయికి ఏకంగా 6 రూపాయలు తిరిగిస్తోందని చెప్పారు. ఈమేరకు శనివారం చెన్నైలో స్టాలిన్ సర్కారు ఏర్పాటు చేసిన అఖిలపక్ష భేటీలో రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. పన్నుల చెల్లింపు విషయంలో తెలంగాణతో పాటు తమిళనాడు (రూపాయికి 26 పైసలు), కర్ణాటకకు (రూపాయికి 16 పైసలు) మాత్రమే అందుతున్నాయని తెలిపారు. ఈ విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని రేవంత్ రెడ్డి చెప్పారు. ఉత్తరాది రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్ కు (రూపాయికి రూ. 2.03), మధ్యప్రదేశ్ కు (రూపాయికి రూ.1.73) అందుతున్నాయని తెలిపారు.
‘తెలంగాణలో వేగవంతమైన ఆర్థిక అభివృద్ధిని సాధించాం. జీఎస్‌డీపీ, తలసరి ఆదాయంలోనూ వృద్ధి సాధించాం. తెలంగాణలో సుపరిపాలనతోపాటు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. అభివృద్ధిలో రాణిస్తున్న తెలంగాణ వంటి రాష్ట్రాలకు రాజకీయ పరిమితులు చేటు చేస్తాయి’ అని రేవంత్ రెడ్డి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన డీలిమిటేషన్ కు తెలంగాణ వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఈ విధానంలో పారదర్శకత లోపించిందని, దీనివల్ల రాష్ట్రాల మధ్య రాజకీయ అసమానత్వం ఏర్పడుతుందని రేవంత్ రెడ్డి చెప్పారు. దీనిని కట్టడి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. డీలిమిటేషన్ పేరుతో లోక్ సభ సీట్లు పెంచవద్దని, సీట్ల పెంపుతో సంబంధంలేకుండా అంతర్గత డీలిమిటేషన్ చేపట్టాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. 1976 లో కూడా లోక్ సభ సీట్లు పెంచకుండానే డీలిమిటేషన్ జరిపారని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. ఇప్పుడు కూడా ఇదే పద్ధతిని అనుసరించాలని ప్రధాని నరేంద్ర మోదీకి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.