IPL Ticket Black Marketing: ఉప్పల్ మెట్రో వద్ద ఐపీఎల్ టికెట్ల బ్లాక్ దందా

- రేపు సన్ రైజర్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్
- నిమిషాల వ్యవధిలో అమ్ముడుపోయిన టికెట్లు
- డిమాండ్ ఎక్కువగా ఉండడంతో బ్లాక్ లో అమ్ముతున్న యువకుడు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో భాగంగా ఆదివారం ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్ శనివారం ప్రారంభం కాగా ఆదివారం జరిగే రెండో మ్యాచ్ కోసం ఇరు జట్ల అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. స్టేడియంలో ప్రత్యక్షంగా వీక్షించాలని ఆశపడుతున్నారు. ఈ మ్యాచ్ టికెట్లను ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో విక్రయించగా నిమిషాల వ్యవధిలో అమ్ముడయ్యాయి.
చాలామంది అభిమానులు టికెట్లు దొరకక నిరాశకు గురయ్యారు. ఈ డిమాండ్ ను సొమ్ముచేసుకునేందుకు టికెట్లు దక్కించుకున్న కొంతమంది కేటుగాళ్లు వాటిని బ్లాక్ లో అమ్ముతున్నారు. టికెట్ల కోసం ఉప్పల్ స్టేడియానికి వచ్చి వెళుతున్న వారికి అధిక ధరలకు అమ్మజూపుతున్నారు. శనివారం ఉప్పల్ మెట్రో వద్ద భరద్వాజ్ అనే యువకుడు బ్లాక్ లో టికెట్లు అమ్ముతున్నాడని సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. భదద్వాజ్ ను అరెస్ట్ చేసి, అతడి వద్ద ఉన్న నాలుగు టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. భరద్వాజ్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.