IPL 2025: ఈసారి ఐపీఎల్‌లో మూడు కొత్త రూల్స్ తీసుకొచ్చిన బీసీసీఐ

BCCI Announces Three New Rules for IPL 2025

  • మ‌రికొన్ని గంట‌ల్లో ఐపీఎల్ 18వ ఎడిషన్‌
  • తొలి మ్యాచ్‌లో త‌ల‌ప‌డ‌నున్న కేకేఆర్‌, ఆర్‌సీబీ
  • బంతిపై ఉమ్మి రాయ‌డంపై ఉన్న నిషేధం ఎత్తివేత‌
  • రెండో ఇన్నింగ్స్‌లో రెండో కొత్త బంతి.. వైడ్స్ కోసం డీఆర్ఎస్‌

మ‌రికొన్ని గంట‌ల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ ఎడిషన్‌కు తెర‌లేవ‌నుంది. ఈడెన్ గార్డెన్స్‌లో డిఫెండింగ్ ఛాంపియ‌న్ కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ (కేకేఆర్‌), రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్‌సీబీ) తొలి మ్యాచ్‌లో  త‌ల‌ప‌డ‌నున్నాయి. అయితే, ఈ సీజన్ కోసం బీసీసీఐ మూడు కొత్త నియమాల‌ను తీసుకొచ్చింది. బీసీసీఐ తీసుకువచ్చిన ఆ మూడు నియమాలేంటో ఇప్పుడు చూద్దాం.

లాలాజల నిషేధం ఎత్తివేత‌...
క‌రోనా మహమ్మారి స‌మ‌యంలో బౌల‌ర్లు బంతిపై ఉమ్మిని రాయ‌డాన్ని నిషేధించిన విష‌యం తెలిసిందే. అయితే, ఈ సీజ‌న్‌లో దీన్ని ఎత్తివేసింది. బౌలర్లు బంతిని మెరిపించడానికి లాలాజ‌లం ఉపయోగించుకోవచ్చు. ఇటీవ‌ల ముంబ‌యిలో జరిగిన కెప్టెన్ల సమావేశంలో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. మెజారిటీ కెప్టెన్లు ఈ నిషేధాన్ని ఎత్తివేయాలంటూ త‌మ అభిప్రాయాన్ని వెల్ల‌డించారు. దీంతో కెప్లెన్ల‌ ఏకాభిప్రాయంతో బీసీసీఐ నిషేధాన్ని ఎత్తివేసింది. 

రెండో ఇన్నింగ్స్‌లో రెండో కొత్త బంతి...
ఈ సీజన్‌లో సాయంత్రం మ్యాచ్‌లకు రెండవ ఇన్నింగ్స్‌లో 11వ ఓవర్ నుంచి కొత్త బంతిని ఇస్తారు. అయితే, ఆన్-ఫీల్డ్ అంపైర్లు మంచు కారకాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని కొత్త బంతి ఇవ్వాలా వ‌ద్దా అనే విష‌యాన్ని నిర్ణ‌యించ‌డం జ‌రుగుతుంది. అయితే, ఈ నియమం మధ్యాహ్నం మ్యాచ్‌లకు వర్తించదు.

వైడ్స్ కోసం డీఆర్ఎస్‌...
తొలిసారిగా డెసిషన్ రివ్యూ సిస్టమ్ (డీఆర్ఎస్‌)ను హైట్ వైడ్‌లు, ఆఫ్-సైడ్ వైడ్‌ల‌ను నిర్ధారించ‌డానికి విస్తరించారు. అయితే, లెగ్-సైడ్ వైడ్‌లు మాత్రం ఎప్ప‌టిలాగే ఆన్-ఫీల్డ్ అంపైర్ ద్వారా నిర్ణయించబడతాయి.

మరోవైపు ఇంపాక్ట్ ప్లేయర్ నియమాన్ని ఈ సీజ‌న్‌లో కూడా కొనసాగించాలని బోర్డు నిర్ణయించింది. ఇది ఫ్రాంచైజీలు సాంప్రదాయ 11 మంది ఆటగాళ్లకు బదులుగా 12 మంది ఆటగాళ్లను ఆడటానికి అనుమతిస్తుంది. కాగా, గతేడాది ఈ నియమం చాలా విమర్శలను ఎదుర్కొన్న విష‌యం తెలిసిందే. ఇది ఆల్ రౌండర్లపై తీవ్ర ప్ర‌భావాన్ని చూపిస్తుంద‌నే అభిప్రాయాలు వెలువ‌డ్డాయి. అయితే, బీసీసీఐ మాత్రం ఈ ఏడాది కూడా ఈ నియమాన్ని కొనసాగించడానికే మొగ్గు చూపించింది.

  • Loading...

More Telugu News