MEO: ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వ అధికారి వ్యాఖ్యలు.. ఎంఈవో తీరుపై విమర్శలు

- సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రచారం
- వైసీపీ అనుబంధ సంఘంలో మెసేజ్ లు
- ఉపాధ్యాయుల అధికారిక సమావేశంలోనూ కూటమి సర్కారుపై విమర్శలు
కడప జిల్లా కేంద్రం సమీపంలోని ఓ మండలానికి విద్యాధికారిగా పనిచేస్తున్న ఉద్యోగి తీరు ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. బాధ్యతగల ఉద్యోగంలో ఉంటూ విధినిర్వహణపై దృష్టి సారించాల్సిన ఉద్యోగి రాజకీయ వ్యాఖ్యలు చేయడంపై సహోద్యోగులు మండిపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ గత ప్రభుత్వమే వస్తుందని ప్రచారం చేయడంతో పాటు వైసీపీ అనుబంధ సంఘంలో యాక్టివ్ గా వ్యవహరించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ సదరు ఎంఈవో పట్టించుకోకుండా ఏకంగా సీఎం చంద్రబాబుపై వాట్సాప్ గ్రూపులో వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు.
ఉపాధ్యాయుల అధికారిక సమావేశంలో మాట్లాడుతూ.. ‘ఈ ప్రభుత్వంతో ఒరిగేదేమీ లేదు.. పాత ప్రభుత్వమే మళ్లీ వస్తుంది. గతంలో పాఠశాల విద్య ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ అనుసరించిన విధానాలే మంచివి అనుకునే స్థాయి వస్తుంది చూడండి’ అంటూ బహిరంగంగా వ్యాఖ్యానించారు. ఈ మండలానికి ఇద్దరు ఎంఈవోలు ఉండగా.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న ఎంఈవోపై తోటి ఎంఈవో ఫిర్యాదు చేశారు. పాఠశాల విద్య ఆర్జేడీకి రాతపూర్వకంగా ఫిర్యాదు సమర్పించారు.
సదరు ఎంఈవోపై గతంలోనూ పలు ఆరోపణలు వెల్లువెత్తాయని, ఒకసారి మహిళలు ఆయనపై దాడి చేసేందుకు ప్రయత్నించారని తెలుస్తోంది. మరో సందర్భంలో మహిళా ఉద్యోగినితో అసభ్యకరంగా ప్రవర్తించి ఘర్షణ పడ్డారని సమాచారం. ప్రభుత్వ అధికారిగా విధులు నిర్వహిస్తూ ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం జరపడం సరికాదని, సదరు ఎంఈవోపై ఉద్యోగుల ప్రవర్తన నియమావళి నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.