Dragon Movie: ఇలాంటి సినిమా చూడలేదు 'డ్రాగన్' .. అందుకే అన్ని కోట్ల వసూళ్లు!

- తమిళంలో హిట్ కొట్టిన 'డ్రాగన్'
- 150 కోట్లకి పైగా వసూళ్లు రాబట్టిన మూవీ
- యూత్ కి కావలసినంత వినోదం
- వాళ్లకి అవసరమైన సందేశం
హీరో .. తెరపై ఏమైనా చేస్తాడు. ఆయన అల్లరి పనులు .. ఆకతాయి వేషాలను చూస్తూ ఎంజాయ్ చేయవలసిందే. ఒకవేళ అలా చేయలేకపోతే టిక్కెట్ డబ్బులు గిట్టుబాటు కానట్టే. అందువలన మంచి చేసినా .. చెడు చేసినా అది హీరోకి మాత్రమే సాధ్యమని భావించి ఆయనను ఫాలో అవుతూ వెళ్లవలసి ఉంటుంది. అలా కాకుండా హీరోను కూడా దార్లో పెట్టే ఒక పాత్ర తెరపైకి వస్తే చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది కదా అని కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది. అలా అనుకునేవాళ్లు 'డ్రాగన్' సినిమాను చూడొచ్చు.
ఈ సినిమాలో హీరో ఇంజనీరింగ్ మధ్యలో ఆపేసి ఇంటికి వెళ్లిపోతాడు. ఎందుకంటే కాలేజ్ వాతావరణం .. కష్టపడి చదివితేనే పాస్ చేసే తీరు అతనికి నచ్చదు. పిల్లలకు అన్నిటికంటే అతి తేలికైన విషయం ఏమిటంటే పేరెంట్స్ ను మోసం చేయడం. ఈ విషయంలో వాళ్లకి ఎవరూ ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. హీరో కూడా అలా పేరెంట్స్ ను మోసం చేసి, నకిలీ సర్టిఫికెట్లను సంపాదిస్తాడు. బాస్ ను నమ్మించి ప్రమోషన్లతో దూసుకెళుతూ ఉంటాడు.
సాధారణంగా ఇక్కడే కథను ఆపేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. హీరో భలేగా సాధించాడే అనుకుంటూ ఆడియన్స్ ఇంటిదారి పడతారు. కానీ ఇక్కడే కథలో ప్రిన్సిపాల్ ఎంట్రీ ఇస్తాడు. 'చదువుకోని వాళ్లు రాంగ్ రూట్లో ఎదిగిపోతే, మరి కష్టపడి చదువుకున్న వాళ్ల పరిస్థితి ఏంటి బాబూ' అంటూ హీరోని మళ్లీ కాలేజ్ గేట్ వరకూ రప్పించే కథ .. ఆ తరువాత జరిగే సీన్స్ కొత్తగా ఉంటాయి. ఒక్కరిని సరిదిద్దకపోతే అది వందమందికి ఇచ్చే సందేశమవుతుందని భావించిన ప్రిన్సిపాల్ పాత్ర ఈ సినిమాకి హైలైట్. 150 కోట్లకి పైగా వసూళ్లను ఈ సినిమా ఎలా సాధించిందనేది తెలియాలంటే, 'నెట్ ఫ్లిక్స్'లో అందుబాటులో ఉన్న ఈ సినిమాను ఒకసారి చూడాల్సిందే.