Mallar Reddy: పార్టీ మారడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Malla Reddys Sensational Remarks on Party Switching

--


మేడ్చల్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నేత మల్లారెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ కావడం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సమావేశానికి మల్లారెడ్డి అల్లుడు, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కూడా హాజరయ్యారు. దీంతో అల్లుడితో కలిసి మల్లారెడ్డి పార్టీ మారుతున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ప్రచారంపై మల్లారెడ్డి స్పందిస్తూ.. పార్టీ మారిన నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిని కలిస్తే పార్టీ మారతారని ప్రచారం చేయడం తగదన్నారు. జిల్లాలో అభివృద్ధి పనులతో పాటు మెడికల్, ఇంజినీరింగ్ సీట్ల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశానని తెలిపారు. నియోజకవర్గంలో పెండింగ్‌ లో ఉన్న పనులను పూర్తి చేయించేందుకు సీఎంను కలవడంలో తప్పేముందని ప్రశ్నించారు.

కాంగ్రెస్ లో చేరిన తమ పార్టీ నేతలు అక్కడ ఇమడలేక పరేషాన్ అవుతున్నారని మల్లారెడ్డి చెప్పారు. వాళ్లు ఇబ్బంది పడడం చూస్తూనే ఉన్నానని, అది చూసి కూడా తాను పార్టీ ఎలా మారుతానంటూ సెటైర్ వేశారు. ప్రస్తుతం తన వయసు 72 ఏళ్లు అని, ఈ వయసులో తాను ఎందుకు పార్టీ మారతానని మీడియాను ఎదురుప్రశ్నించాడు. ఆ మాటకొస్తే బీఆర్ఎస్ నుంచి పోటీ చేయడానికి తమ కుటుంబంలో నలుగురు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. జమిలీ ఎన్నికలు వస్తే తాను ఎంపీగానే పోటీ చేస్తానని మల్లారెడ్డి స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News