Sridevi: శ్రీదేవి .. జర జాగ్రత్త అంటున్న ఫ్యాన్స్!

- 'కోర్ట్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి
- తొలి సినిమాతోనే దక్కిన హిట్
- యూత్ లో పెరిగిన ఫాలోయింగ్
- పెద్ద హీరోయిన్ కావాలని ఉందంటున్న బ్యూటీ
సినిమా ఇండస్ట్రీ అనేది ఒక ప్రత్యేక ప్రపంచం. ఇక్కడ హీరోయిన్ గా అడుగుపెట్టడం అనుకున్నంత తేలిక కాదు. డబ్బూ .. పేరు రెండూ ఒక్కసారిగా వచ్చి పడే ఫీల్డ్ ఇది. అందువలన ఇక్కడ పోటీ కాస్త గట్టిగానే ఉంటుంది. రోజుకు కొన్ని వందల మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఇక్కడికి వస్తుంటారు. అలాంటి చోటున నిలదొక్కుకోవడం అంత ఆషామాషీ కాదు. అయినా కాకినాడ శ్రీదేవి ఇక్కడికి వచ్చి, 'కోర్ట్' సినిమాతో పెద్ద హిట్ కొట్టేసింది.
'కోర్ట్' సినిమా చూసినవాళ్లు 'ఎవరీ అమ్మాయి ఇంత బాగా చేసింది' అనుకోకుండా ఉండలేరు. రీల్స్ చేస్తూ శ్రీదేవి నిదానంగా ఈ ట్రాక్ లోకి వచ్చింది. అయితే అదృష్టం కలిసొచ్చి మొదటి సినిమాతోనే పెద్ద హిట్ ను నమోదు చేసింది. యూత్ లో నుంచి చాలామందిని తన అభిమానులుగా మార్చేసింది. అవకాశాలు కూడా 'క్యూ' కడుతున్నాయి. చాలా పెద్ద హీరోయిన్ ను కావాలని ఉందనీ, తప్పకుండా అవుతాననే నమ్మకం ఉందని ఇంటర్వ్యూలలో శ్రీదేవి చెబుతోంది. చాలా చిన్న ఏజ్ లోనే హీరోయిన్ గా సక్సెస్ చూసిన శ్రీదేవి, ఎలాంటి కథలను ఎంచుకుంటుందా అనేది ఆసక్తికరంగా మారింది.
సినిమా ఫీల్డ్ లో నెగ్గుకు రావడమనేది అంత తేలికైన విషయమేం కాదు. కృతి శెట్టి .. శ్రీలీల వంటి గ్లామరస్ బ్యూటీలు తొలి సినిమాతోనే భారీ విజయాలను తమ ఖాతాలో వేసుకున్నారు. ఆ తరువాత కూడా పెద్ద హిట్లే కొట్టారు. కానీ ఇప్పుడు వారి చేతిలో ఉన్న ప్రాజెక్టులు చాలా తక్కువ. ఇక 'బేబి' సినిమాతో యూత్ ను ఒక ఊపు ఊపేసిన వైష్ణవి చైతన్య కూడా ఆ తరువాత ఆ జోరును కొనసాగించలేకపోయింది. ఏప్రిల్ 10న విడుదల కానున్న 'జాక్' పైనే ఆమె ఆశలు పెట్టుకుంది. అందువలన కథలను .. పాత్రలను ఎంచుకునే విషయంలో శ్రీదేవికి ఫ్యాన్స్ జాగ్రత్తలు చెబుతున్నారు.