Indian Students: అమెరికాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచన

India Issues Crucial Advice to Students in America

  • అమెరికా చట్టాలకు భారతీయ విద్యార్థులు లోబడి ఉండాలన్న కేంద్రం
  • అక్కడి చట్టాలు, నిబంధనలను పాటించాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందని వ్యాఖ్య
  • ఏవైనా ఇబ్బందులు వస్తే భారత ఎంబసీ, కాన్సులేట్ కార్యాలయాలు సాయం అందిస్తాయన్న కేంద్రం

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలను చేపట్టిన తర్వాత సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. వీసాలు, వలస విధానాలపై నిర్ణయాలు ఆయా దేశాల విచక్షణాధికారాలకు సంబంధించినవని... వాటిని పాటించాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉంటుందని తెలిపింది. అమెరికా చట్టాలకు లోబడి అక్కడ చదువుకుంటున్న భారతీయ విద్యార్థులు ఉండాలని సూచించింది. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా అమెరికాలోని భారత ఎంబసీ, కాన్సులేట్ కార్యాలయాలు సాయం అందిస్తాయని తెలిపింది. 

విదేశీయులు మన దేశానికి వచ్చినప్పుడు మన చట్టాలు, నిబంధనలకు కట్టుబడి ఉండాలని మనం భావిస్తామని... అదేవిధంగా మన పౌరులు విదేశాల్లో ఉన్నప్పుడు ఆయా దేశాల చట్టాలు, నిబంధనలను పాటించాలని విదేశాంగ శాఖ కార్యదర్శి రణధీర్ జైస్వాల్ సూచించారు. చట్టవిరుద్ధ నిరసనలను అనుమతించే కాలేజీలు, యూనివర్శిటీలకు ఫెడరల్ నిధులను నిలిపివేస్తామని... ఆందోళనలకు పాల్పడే వారిని జైలుకు లేదా వారి స్వదేశానికి పంపించడం జరుగుతుందని ఇటీవల ట్రంప్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే అక్కడ చదువుకుంటున్న విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు చేసింది.

  • Loading...

More Telugu News