Free Services at Petrol Bunks: పెట్రోల్ బంకుల్లో మీకు లభించే ఉచిత సేవలు ఏమిటో తెలుసా?

Free Services Offered at Petrol Bunks in India

  • టైర్లకు ఉచిత గాలి, తాగునీరు, టాయిలెట్లు తప్పనిసరి
  • ప్రథమ చికిత్స, అత్యవసర ఫోన్ కాల్స్ సదుపాయం
  • అగ్నిమాపక పరికరాలు అందుబాటులో ఉండాలి
  • ఇంధనం నాణ్యత, పరిమాణం తనిఖీ చేసే అవకాశం
  • సేవలు అందించకుంటే ఫిర్యాదు చేయవచ్చు

ప్రమాద సమయంలోనో, అత్యవసర పరిస్థితుల్లోనో రోడ్డు పక్కన పెట్రోల్ బంకు కనిపిస్తే మనకు వెంటనే గుర్తొచ్చేది ఇంధనం నింపుకోవడానికే. అయితే, పెట్రోల్ బంకుల్లో ఉచితంగా లభించే కొన్ని ముఖ్యమైన సేవలు ఉన్నాయని మీకు తెలుసా? వాహనదారులు వీటి గురించి తెలుసుకోవడం చాలా అవసరం. అవేంటో చూద్దాం:

1. నాణ్యత మరియు పరిమాణ తనిఖీ:
మీరు కొనుగోలు చేస్తున్న పెట్రోల్ లేదా డీజిల్ నాణ్యతపై అనుమానం ఉంటే, అక్కడే ఫిల్టర్ పేపర్ టెస్ట్ చేయమని అడగవచ్చు. దీనికి ఎలాంటి ఛార్జీ వసూలు చేయరు. అలాగే, ఇంధనం పరిమాణంపై అనుమానం ఉంటే, దానిని కూడా ఉచితంగా తనిఖీ చేయించుకోవచ్చు. ఈ సేవలను అందించడానికి పెట్రోల్ బంక్ సిబ్బంది నిరాకరించకూడదు.

2. ప్రథమ చికిత్స కిట్:
రోడ్డు ప్రమాదాలు ఎక్కడైనా జరగవచ్చు. ప్రమాదం జరిగినప్పుడు బాధితులకు సాయం చేయడానికి ప్రథమ చికిత్స పెట్టె అవసరమవుతుంది. దగ్గరలోని పెట్రోల్ బంకులో అడిగితే, ఉచితంగా ఫస్ట్ ఎయిడ్ కిట్ అందిస్తారు. ప్రతి పెట్రోల్ బంకులో ఇది అందుబాటులో ఉండాలి.

3. అత్యవసర ఫోన్ కాల్:
అత్యవసర పరిస్థితుల్లో పెట్రోల్ బంక్ లో నుంచి ఫోన్ చేసుకోవచ్చు. ప్రమాద బాధితుల బంధువులకు సమాచారం ఇవ్వాలన్నా, లేదా మరెవరికైనా అత్యవసరంగా ఫోన్ చేయాలన్నా ఈ సదుపాయం ఉపయోగించుకోవచ్చు.

4. మరుగుదొడ్లు:
ప్రయాణాల్లో మహిళలకు పరిశుభ్రమైన టాయిలెట్లు దొరకడం కష్టమవుతుంది. పెట్రోల్ బంకుల్లోని టాయిలెట్లను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. వినియోగదారులు కానప్పటికీ, టాయిలెట్ ఉపయోగించడానికి అనుమతిస్తారు.

5. త్రాగునీరు:
ప్రతి పెట్రోల్ బంకులో శుద్ధమైన త్రాగునీటిని ఉచితంగా అందించాలి. మీరు అక్కడే తాగవచ్చు లేదా మీ సీసాల్లో నింపుకోవచ్చు.

6. ఉచితంగా గాలి:
టైర్లలో గాలి నింపడానికి డబ్బులు వసూలు చేస్తే అది చట్టవిరుద్ధం. ప్రతి పెట్రోల్ బంకులో టైర్లకు గాలి నింపడం ఉచితం. దీనికి డబ్బులు అడిగితే, పెట్రోల్ బంక్ మేనేజ్ మెంట్ కు లేదా సంబంధిత శాఖకు ఫిర్యాదు చేయవచ్చు.

పైన పేర్కొన్న ఉచిత సేవలను అందించడంలో పెట్రోల్ బంక్ సిబ్బంది విఫలమైనా లేక వాటికి డబ్బు వసూలు చేసినా, వినియోగదారులు సంబంధిత పెట్రోలియం సంస్థకు లేదా జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయవచ్చు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) సంస్థలకు చెందిన టోల్-ఫ్రీ నంబర్లకు (IOCL: 1800-2333-555, HPCL: 1800-2333-555, BPCL: 1800-22-4344) ఫోన్ చేయడం ద్వారా లేదా ఆయా సంస్థల వెబ్‌సైట్‌ల ద్వారా ఫిర్యాదు నమోదు చేయవచ్చు.

  • Loading...

More Telugu News