Annamayya District Police Transfers: అన్నమయ్య జిల్లాలో 364 మంది పోలీసు సిబ్బంది బదిలీ

Major Police Reshuffle in Andhra Pradeshs Annamayya District

  • అరాచక శక్తులకు, ప్రతిపక్ష నేతలకు సహకరిస్తున్న పోలీసులపై చర్యలు
  • సమస్యాత్మక జిల్లాల్లో అక్రమాలపై  ప్రభుత్వం ఆరా
  • పోలీసు శాఖలో ప్రక్షాళన చర్యలు వేగవంతం

పోలీస్ శాఖలో ప్రక్షాళన చర్యలు ప్రారంభమయ్యాయి. మొదట చిత్తూరు జిల్లాలో చేపట్టిన ఈ ప్రక్రియను, తాజాగా అన్నమయ్య జిల్లాలో కొనసాగిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో 264 మంది సిబ్బందిని బదిలీ చేసిన అధికారులు, తాజాగా అన్నమయ్య జిల్లాలో 364 మంది సిబ్బందిని బదిలీ చేశారు. వీరిలో 41 మంది ఏఎస్సైలు, 123 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 200 మంది కానిస్టేబుళ్లు ఉన్నారు.

క్షేత్రస్థాయిలో కొందరు పోలీసులు ప్రతిపక్ష  నేతలకు సహకరిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ బదిలీలు జరిగాయని తెలుస్తోంది. పుంగనూరుకు చెందిన టీడీపీ కార్యకర్త రామకృష్ణ తన ప్రాణాలకు రక్షణ కల్పించాలని వేడుకున్నా పట్టించుకోకపోవడంతో ఆయన హత్యకు గురయ్యారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్‌గా స్పందించారు. అరాచక శక్తులను ఉపేక్షించేది లేదని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ గుప్తాను ఆదేశించారు.

దీంతో అరాచక శక్తులను అణచివేయడంతో పాటు పోలీస్ శాఖలో ప్రక్షాళన చేపట్టారు. చిత్తూరు జిల్లా నుంచే డీజీపీ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అరాచక శక్తులకు, ప్రతిపక్ష నేతలకు సహకరిస్తున్న పోలీసులను బదిలీ చేయించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాబల్యం ఉన్న ఒక పోలీస్ స్టేషన్‌లోని సిబ్బంది మొత్తాన్ని (42 మంది) తొలగించి కొత్త వారిని నియమించారు.

అలాగే ఇతర జిల్లాల్లో కూడా ఇలాంటి సిబ్బందిని గుర్తించి బదిలీ చేసేందుకు అధికారులు జాబితా సిద్ధం చేస్తున్నారు. రాయలసీమ, పల్నాడు, గుంటూరు, విజయవాడ, కృష్ణా వంటి సమస్యాత్మక జిల్లాల్లో గతంలో జరిగిన అక్రమాలపై వివరాలు సేకరిస్తున్నారు. నేరస్తుల వివరాలు, వారిపై ఉన్న కేసులు, భూ కబ్జాలు, బెదిరింపులు, రౌడీషీట్లు, అక్రమ ఆస్తులు, కేసుల దర్యాప్తు స్థితి వంటి వివరాలను సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సేకరిస్తున్నారు.

  • Loading...

More Telugu News