Shamshabad Airport: శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికుల నిరసన.. కారణమిదే!

- హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం ఆలస్యం
- సుమారు 150 మంది ప్రయాణికులు గంటలతరబడి ఎయిర్‌పోర్టులో పడిగాపులు
- ఫ్లైట్ ఆలస్యంపై ముందస్తు సమాచారం లేకపోవడంతో ప్రయాణికుల ఆగ్రహం
ఈరోజు ఉదయం శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం ఆలస్యం కావడమే ఇందుకు కారణం. శ్రీనగర్ నుంచి రావాల్సిన ఫ్లైట్ షెడ్యూల్ ప్రకారం రన్‌వేపైకి రాకపోవడంతో సుమారు 150 మంది ప్రయాణికులు గంటలతరబడి ఎయిర్‌పోర్టులో పడిగాపులు కాశారు.
విమానం ఆలస్యానికి గల కారణమై ఎయిరిండియా ప్రతినిధులను ప్రయాణికులు ప్రశ్నించారు. అయితే, వారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీనగర్ నుంచి విమానం రాకముందే బోర్డింగ్ ఎందుకు ఇచ్చారంటూ ఆందోళనకు దిగారు. ఫ్లైట్ ఆలస్యం అవుతుందని ముందే సమాచారం ఇవ్వకుండా ఇలా విమానాశ్రయంలో వెయిట్ చేయించడం ఏంటని ప్రయాణికులు ఎయిరిండియా ప్రతినిధులతో వాగ్వాదానికి దిగారు. దీంతో కొద్దిసేపు ఎయిర్‌పోర్టులో గందరగోళం నెలకొంది.