Jyothi Ray: అమావాస్య చీకట్లో ఆగని ప్రమాదాలు .. ఓటీటీలో 'నైట్ రోడ్'

- కన్నడలో రూపొందిన 'నైట్ రోడ్'
- ప్రధానమైన పాత్రను పోషించిన జ్యోతిరాయ్
- మర్డర్ మిస్టరీ చుట్టూ తిరిగే కథ
- రెంటల్ విధానంలో అందుబాటులోకి వచ్చిన కంటెంట్
చాలా ప్రాంతాల్లో .. ఒకే ప్రదేశంలో తరచూ ప్రమాదాలు జరుగుతూ ఉండటం మనం చూస్తుంటాము. అక్కడ ప్రమాదానికి గురైన వారు బ్రతకడం కష్టమనే విషయాన్ని స్థానికులు అనుభవపూర్వకంగా చెబుతూ ఉంటారు. అయితే అక్కడే ఎందుకు ప్రమాదాలు జరుగుతున్నాయి? అందుకు గల కారణం ఏమిటి? అనే విషయాన్ని పట్టించుకునేవారు .. పరిశోధించేవారు ఎవరూ కనిపించరు. అలాంటి ఒక విషయాన్ని పట్టించుకుంటే బయటపడే నిజమే 'నైట్ రోడ్' మూవీ కథ.
జ్యోతిరాయ్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాకి, గోపాల్ దర్శకత్వం వహించాడు. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ జోనర్లో నిర్మితమైన సినిమా ఇది. జ్యోతిరాయ్ తో పాటు, ధర్మ .. గిరిజా లోకేశ్ .. రేణు శిఖారి ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు. క్రితం ఏడాది థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, మంచి వసూళ్లను రాబట్టింది. కొన్ని కారణాల వలన కొంత ఆలస్యంగానే ఈ సినిమా ఓటీటీకి వచ్చింది. రెంటల్ విధానంలో అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది.
బెంగుళూర్ - కడతి హైవేలోని ఒక ప్రదేశంలో .. అమావాస్య రాత్రివేళలో ఎక్కువ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అలాగే ఒక అమావాస్య రోజు రాత్రి అక్కడ జరిగిన ప్రమాదంలో పోలీస్ ఆఫీసర్ 'దీక్ష' తమ్ముడు కల్యాణ్ చనిపోతాడు. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ను చేపట్టిన దీక్షకు ఎలాంటి నిజం తెలుస్తుంది? అప్పుడు ఆమె ఏం చేస్తుంది? అనేది కథ. ఓటీటీ వైవు నుంచి కూడా ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.