Missing Woman: చేతిపై టాటూతో పొరబడిన పేరెంట్స్.. తమ కూతురే అనుకుని అంత్యక్రియలు .. తీరా చూస్తే..

- హత్యకు గురైందని పోలీస్ కేసు.. నలుగురికి శిక్ష కూడా పడిన వైనం
- గుర్తు తెలియని మృతదేహం విషయంలో పొరబడ్డ తల్లిదండ్రులు
- చేతిపై టాటూ ఆధారంగా తమ కూతురేనని భావించినట్లు వెల్లడి
మధ్యప్రదేశ్ లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. కూమార్తె కనిపించకుండా పోవడంతో పోలీసులను ఆశ్రయించిన తల్లిదండ్రులు.. గుర్తుతెలియని ఓ మృతదేహం తమ కూతురుదేనని గుర్తించారు. లాంఛనాలన్నీ పూర్తయ్యాక డెడ్ బాడీని తీసుకెళ్లి అంత్యక్రియలు చేశారు. వారి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. నలుగురు నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఇదంతా జరిగిన పద్దెనిమిది నెలల తర్వాత చనిపోయిందని భావించి అంత్యక్రియలు కూడా చేసిన సదరు మహిళ ఇంటికి తిరిగివచ్చింది.
మధ్యప్రదేశ్ లోని మండ్సర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధిత కుటుంబం, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పద్దెనిమిది నెలల క్రితం లలితా బాయి అనే మహిళ కనిపించకుండా పోయింది. లలితా బాయి తండ్రి రమేశ్ నానూరామ్ బంచాడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత మార్చురీలోని ఓ మృతదేహాన్ని గుర్తించడంలో పొరబడడం, కూతురు చనిపోయిందని నమ్మి అంత్యక్రియలు చేయడం వెనువెంటనే జరిగిపోయాయి.
ఇంటికి తిరిగి వచ్చిన లలితా బాయిని పోలీసులు ప్రశ్నించగా.. తెలిసిన వ్యక్తి తనను మోసం చేసి రూ. 5 లక్షలకు అమ్మేశాడని, ఇప్పటి వరకు బంధీగా ఉన్నానని చెప్పింది. అవకాశం చిక్కడంతో వారి చెర నుంచి బయటపడి ఇంటికి తిరిగొచ్చానని వివరించింది. అయితే, లలితా బాయిని హత్య చేశారనే ఆరోపణలతో నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. తాజా పరిణామంతో చేయని హత్యకు వారిని జైలుకు పంపారని పోలీసులపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.