IPL: నేటి నుంచే ఐపీఎల్ మ‌హాసంగ్రామం.. టాప్‌లో వీరే..!

Top Performers and Records in IPL from 2008 to 2024

  • నేటి నుంచి ఐపీఎల్ 18వ సీజ‌న్‌
  • ఈడెన్ గార్డెన్స్‌లో కేకేఆర్, ఆర్‌సీబీ మ‌ధ్య తొలి మ్యాచ్‌
  • గ‌త 17 ఎడిష‌న్ల‌లో క‌లిపి అత్య‌ధిక ర‌న్స్ చేసింది కోహ్లీ
  • అత్య‌ధిక వికెట్లు చాహ‌ల్‌.. అత్య‌ధిక మ్యాచ్‌లు ధోనీ
  • అత్య‌ధిక సిక్స‌ర్లు గేల్‌.. అత్య‌ధిక ఫోర్లు ధావ‌న్‌

నేటి నుంచి మ‌హాసంగ్రామానికి తెర‌లేవ‌నుంది. క్రికెట్ ఫ్యాన్స్ పండ‌గలా భావించే ఇండియన్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) ఇవాళ ప్రారంభం కానుంది. అయితే, 2008లో మొద‌టి సీజ‌న్‌తో ప్రారంభ‌మైన ఈ మ‌హాసంగ్రామం ఈ ఏడాది 18వ సీజ‌న్‌లోకి అడుగుపెట్టింది. ఈరోజు ఈడెన్ గార్డెన్స్‌లో డిఫెండింగ్ ఛాంపియ‌న్ కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ (కేకేఆర్‌), రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్‌సీబీ) త‌ల‌ప‌డ‌నున్నాయి. గ‌త 17 ఎడిష‌న్ల‌లో క‌లిపి అత్య‌ధిక ప‌రుగులు, అత్య‌ధిక వికెట్లు, అత్య‌ధిక సెంచ‌రీలు, అత్య‌ధిక సార్లు టోర్నీ విజేత‌, అత్య‌ధిక సిక్స‌ర్లు, అత్య‌ధిక ఫోర్లు, అత్య‌ధిక ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్‌లు, అత్య‌ధిక క్యాచ్‌లు, అత్య‌ధిక టీమ్ స్కోర్లు ఇలా ప‌లు విభాగాల‌లో టాప్‌లో ఉన్న రికార్డుల‌పై ఇప్పుడు మ‌నం ఓ లుక్కేద్దాం. 

అత్య‌ధిక ప‌రుగుల రికార్డు ర‌న్‌మెషీన్ విరాట్ కోహ్లీ పేరిట ఉంది. మొద‌టి సీజ‌న్ నుంచి ఆర్‌సీబీకే ఆడుతున్న విరాట్ ఇప్ప‌టివ‌ర‌కూ 8004 ర‌న్స్ చేశాడు. అత్య‌ధిక వికెట్ల రికార్డును స్పిన్న‌ర్ యుజ్వేంద్ర చాహ‌ల్ క‌లిగి ఉన్నాడు. అత‌ని పేరిట 205 ఐపీఎల్ వికెట్లు ఉన్నాయి. అత్య‌ధిక సెంచ‌రీలు కోహ్లీనే బాదాడు. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం ఎనిమిది శ‌త‌కాలు సాధించాడు. అత్య‌ధిక అర్ధ శ‌త‌కాలు డేవిడ్ వార్న‌ర్ (66) న‌మోదు చేశాడు. 

అత్య‌ధిక సార్లు టోర్నీ విజేత‌గా ముంబ‌యి, చెన్నై ఉన్నాయి. ఈ రెండు ఫ్రాంచైజీలు చెరో ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచాయి. అత్య‌ధిక వ్య‌క్తిగ‌త స్కోర్ యూనివ‌ర్స‌ల్ బాస్ క్రిస్ గేల్ (175). అత్య‌ధిక సిక్స‌ర్ల రికార్డు కూడా ఈ క‌రేబియ‌న్ స్టార్ పేరిట‌నే ఉంది. త‌న ఐపీఎల్ కెరీర్‌లో మొత్తం 357 సిక్సులు బాదాడు. ఇక అత్య‌ధిక ఫోర్ల రికార్డును శిఖ‌ర్ ధావ‌న్ క‌లిగి ఉన్నాడు. అత‌ని పేరిట 768 ఐపీఎల్ ఫోర్లు ఉన్నాయి. 

అత్య‌ధిక ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్‌లు సాధించింది ఆర్‌సీబీ మాజీ కెప్టెన్ ఏబీ డివిలియ‌ర్స్. ఇప్ప‌టివ‌ర‌కు అత‌ని ఖాతాలో 25 పీఓటీఎం అవార్డులు ఉన్నాయి. అత్య‌ధిక టీమ్ స్కోరు స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ (287/3). అత్య‌ధిక క్యాచ్‌ల రికార్డు విరాట్ కోహ్లీ పేరిట ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు కోహ్లీ 114 క్యాచ్‌లు అందుకున్నాడు. ఐపీఎల్‌లో అత్య‌ధిక మ్యాచ్‌లు ఆడింది ఎంఎస్ ధోనీ. ఇప్ప‌టివ‌ర‌కు అత‌డు 264 మ్యాచ్‌ల‌కు ప్రాతినిధ్యం వ‌హించాడు. అత్య‌ధిక మ్యాచ్‌ల‌కు సార‌థ్యం (226) వ‌హించింది కూడా ఎంఎస్‌డీనే.   

  • Loading...

More Telugu News