RCB: ఐపీఎల్ ప్రారంభానికి ముందు వివాదానికి తెరతీసిన ఆర్సీబీ.. వీడియో ఇదిగో!

RCB Trolls Mumbai Indians Captaincy Change Viral Video
  • రజత్ పటీదార్‌ను కెప్టెన్‌గా నియమించిన ఆర్సీబీ
  • శుభాకాంక్షలు తెలిపిన డుప్లెసిస్, కోహ్లీ
  • ముంబై కెప్టెన్సీ మార్పు సమయంలో ఇలా జరగలేదని అర్థం వచ్చేలా అవహేళన చేస్తూ వీడియో
  • రజత్ పటీదార్‌తో ‘మిస్టర్ నాగ్స్’ వీడియో వైరల్
ఐపీఎల్ ప్రారంభానికి ముందు ఆర్సీబీ సరికొత్త వివాదానికి తెరలేపింది. ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్సీ మార్పును ఎగతాళి చేస్తున్నట్టుగా ఉన్న ఆర్సీబీ వీడియో ఒకటి సోషల్ మీడియాకెక్కింది. ఇది కాస్తా వైరల్ కావడంతో ఆర్సీబీ చిక్కుల్లో పడింది.

ముంబై ఇండియన్స్‌కు తిరుగులేని విజయాలు అందించిన రోహిత్ శర్మను కాదని, గుజరాత్ టైటాన్స్ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించిన హార్దిక్ పాండ్యాను కొనుగోలు చేసిన ముంబై ఫ్రాంచైజీ ఏకంగా అతడికి జట్టు పగ్గాలు అప్పగించింది. రోహిత్‌ను కాదని, పాండ్యాకు కెప్టెన్సీ అప్పగించడంపై అభిమానులు కూడా తీవ్రంగా వ్యతిరేకించారు.

కాగా, ఈ సీజన్‌లో కెప్టెన్ డుప్లెసిస్‌ను వదులుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు రజత్ పటీదార్‌ను కెప్టెన్‌గా నియమించింది. ఈ నేపథ్యంలో ఆర్సీబీకి చెందిన ‘మిస్టర్ నాగ్స్’ ముంబై ఇండియన్స్‌ను ట్రోల్ చేశాడు. పటీదార్‌తో మాట్లాడుతూ.. ‘‘మొత్తానికి నువ్వు కెప్టెన్ అయ్యావు. ఆర్సీబీ గత సారథులు విరాట్, డుప్లెసిస్ కూడా నీకు అభినందనలు తెలిపారు. మిగతా జట్లు కూడా కెప్టెన్సీ మార్పు సమయంలో ఇలానే చేశాయని అనుకుంటున్నావా?’’ అని ప్రశ్నించాడు. 

దీనికి పటీదార్ స్పందిస్తూ.. తనకా విషయాలు తెలియవని ముక్తసరిగా జవాబిచ్చాడు. దీంతో మళ్లీ కల్పించుకున్న నాగ్.. ‘‘నీకు నిజంగా తెలియదా? మరైతే ఎందుకు నవ్వుతున్నావు’’ అని రెట్టించాడు. అక్కడితో ఆగకుండా ‘‘అంటే నీ ఉద్దేశం ముంబై ఇండియన్స్‌కు తెలియదు (ఎంఐ (మై) నహీ జాన్తా) అనే కదా అని అన్నాడు. ఈ సంభాషణ కాస్తా సోషల్ మీడియాకెక్కడంతో వైరల్ అవుతోంది. ఇది ముంబై కెప్టెన్సీ మార్పును ఎగతాళి చేయడమేనని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మీమ్స్‌తో ఆర్సీబీని ఆడుకుంటున్నారు.
RCB
IPL Controversy
Mumbai Indians
Rohit Sharma
Hardik Pandya
Captaincy Change
Rajat Patidar
Viral Video
Mr Nags
IPL 2024

More Telugu News