Babji: హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం .. అడిషనల్ డీసీపీ దుర్మరణం

- ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో మృతి చెందిన అడిషనల్ డీసీపీ బాబ్జి
- హయత్‌నగర్ లక్ష్మారెడ్డిపాలెం వద్ద జాతీయ రహదారిపై ఘటన
- మార్నింగ్ వాక్ చేస్తూ ప్రమాదానికి గురైన వైనం
హయత్‌నగర్ లక్ష్మారెడ్డిపాలెం వద్ద శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక పోలీస్ అధికారి మృతి చెందారు. లక్ష్మారెడ్డిపాలెం మైత్రీ కుటీర్‌లో నివాసముంటున్న అడిషనల్ డీసీపీ బాబ్జి, ప్రతిరోజూ మాదిరిగానే శనివారం కూడా వేకువజామున మార్నింగ్ వాక్‌కు వెళ్లారు.
ఆయన మార్నింగ్ వాక్ చేస్తూ విజయవాడ జాతీయ రహదారి దాటుతుండగా, అతి వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మరణించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.