Dr. Nageshwar Reddy: ఏపీ సీఎం చంద్రబాబుతో ఏఐజీ ఆసుపత్రుల చైర్మన్ నాగేశ్వర్ రెడ్డి భేటీ

Dr Nageshwar Reddy Meets AP CM Chandrababu Naidu

  • హైదరాబాద్‌లోని నివాసంలో ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన ఏఐజీ హాస్పటల్స్ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి
  • ప్రజల ఆరోగ్య సంరక్షణకు సంబంధించి అంశాలపై చర్చలు
  • సమావేశంలో పాల్గొన్న ఏఐజీ హాస్పటల్స్ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్

పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత, ప్రముఖ ఏఐజీ హాస్పిటల్స్ ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన ఈ సమావేశంలో ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులకు ఏఐ, మెడ్‌టెక్ ఏ విధంగా దోహదపడతాయనే అంశాలపై చర్చించినట్లు చంద్రబాబు 'ఎక్స్' ద్వారా వెల్లడించారు.

ప్రభుత్వం, ఏఐ మెడ్ టెక్ ఫౌండేషన్‌తో కలిసి పరస్పర సహకారంతో ఆరోగ్య రంగంలో మరింత మెరుగైన మార్పులకు కృషి చేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఏఐజీ హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ కలపాల కూడా విలువైన సూచనలు చేశారని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా డాక్టర్ నాగేశ్వరరెడ్డిని ముఖ్యమంత్రి చంద్రబాబు శాలువాతో సత్కరించి, తిరుమల శ్రీవారి జ్ఞాపికను బహుకరించారు. అంతేకాకుండా, స్వామి వారి ప్రసాదాలను అందజేశారు. శుక్రవారం ఉదయం చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న విషయం విదితమే. 

More Telugu News