Vinod Kachawe: మహిళా ఉద్యోగి జుత్తుపై పాటపాడటం లైంగిక వేధింపు కాదు: బొంబాయి హైకోర్టు

- మహిళా ఉద్యోగి జుత్తుపై అధికారి వ్యంగ్య వ్యాఖ్యలు
- అంతర్గత ఫిర్యాదుల కమిటీకి ఫిర్యాదు చేసిన మహిళ
- ఆయన చేసింది నేరమేనని తేల్చిన కమిటీ
- కమిటీ నివేదికపై పూణె పారిశ్రామిక కోర్టుకు అధికారి
- అక్కడా ఎదురుదెబ్బ తగలడంతో హైకోర్టుకు
సహోద్యోగి జుత్తు గురించి వ్యంగ్యంగా వ్యాఖ్యానించి పాట పాడటం లైంగిక వేధింపుల కిందికి రాదని బొంబాయి హైకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న వ్యక్తికి వాటి నుంచి విముక్తి కల్పించింది. కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు సీనియర్ అధికారి అయిన వినోద్ కచావే 2022 జూన్‌లో మహిళా సహోద్యోగి కేశాలను చూసి ‘పొక్లెయిన్‌తో జుత్తు దువ్వినట్టు ఉన్నారే’ అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఓ పాట కూడా పాడారు. దీనిని తీవ్రంగా తీసుకున్న ఆమె బ్యాంకు అంతర్గత ఫిర్యాదుల కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాదు, కచావే ఒక పురుష సహోద్యోగి మర్మాంగం గురించి మహిళా ఉద్యోగుల ముందు వ్యంగ్య వ్యాఖ్యలు చేసినట్టు ఆమె ఆరోపించారు. విచారణ జరిపిన అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఆయన చేసింది నేరమేనని తేల్చింది.
ఈ నివేదికపై కచావే పూణె పారిశ్రామిక కోర్టులో అప్పీలు చేయగా, గతేడాది ఆయనకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. దీంతో అప్పట్లో పూణె శాఖలో అసోసియేట్ రీజనల్ మేనేజర్‌గా ఉన్న కచావే హోదాను బ్యాంకు యాజమాన్యం తగ్గించింది. దీంతో ఆయన ఈసారి హైకోర్టును ఆశ్రయించగా అనుకూల తీర్పు వచ్చింది. మహిళా సహోద్యోగి జుత్తు గురించి వ్యంగ్యంగా వ్యాఖ్యానించి, పాట పాడటాన్ని లైంగిక వేధింపుగా పరిగణించలేమని స్పష్టం చేస్తూ ఆయనపై ఉన్న అభియోగాల నుంచి విముక్తి కల్పించింది.