Chandenker Daulat: తెలంగాణలో అకాల వర్షం.. వడగళ్ల బీభత్సం.. వీడియో ఇదిగో!

- రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం
- వరి, మామిడి పంటలకు నష్టం కలిగించిన వడగళ్ల వాన
- నేటి నుంచి మరో మూడు రోజులపాటు వర్షాలు
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నిన్న తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. కొన్ని చోట్ల కురిసిన వడగళ్ల వర్షం రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చింది. నిజామాబాద్, మెదక్, సిద్దిపేట, మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో పలు చోట్ల ఓ మోస్తరు వర్షం కురిసింది. నిర్మల్ జిల్లా ముథోల్‌లో అత్యధికంగా 2 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
వడగళ్ల వాన కారణంగా వరి, మామిడి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కాగజ్‌నగర్ పట్టణంలోని నాగౌంబస్తీలో ఇంటి గోడ కూలి చందెంకర్ దౌలత్ (79) అనే వృద్ధుడు మృతి చెందాడు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో నిన్న ఉదయం నుంచి హైదరాబాద్‌లో వాతావరణం చల్లబడింది. ఆకాశం మేఘావృతం అయి గరిష్ఠ ఉష్ణోగ్రత 35.8 డిగ్రీలకు పడిపోవడంతో ప్రజలకు ఉపశమనం లభించింది.
నేటి నుంచి సోమవారం వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.