Chandrababu Naidu: ఏప్రిల్ 3న ఏపీ క్యాబినెట్ భేటీ

- ఏప్రిల్ 3 ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ
- అమరావతిలో అభివృద్ధి పనులకు పచ్చ జెండా ఊపనున్న కేబినెట్
- సూపర్ సిక్స్ హామీల్లోని తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలకు ఆమోదం తెలపనున్న కేబినెట్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏప్రిల్ 3న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. వెలగపూడి సచివాలయంలో ఉదయం 11 గంటలకు ఈ సమావేశం ప్రారంభమవుతుంది. సమావేశంలో చర్చించాల్సిన అంశాలను మార్చి 27వ తేదీలోగా పంపాలని వివిధ ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఆదేశాలు జారీ చేశారు.
ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ప్రధానంగా అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే సుమారు 37 వేల కోట్ల రూపాయల విలువైన టెండర్లు ఖరారయ్యాయి. వీటికి ఇదివరకే సీఆర్డీఏ, మంత్రివర్గం ఆమోదం లభించగా, రానున్న సమావేశంలో మరికొన్ని ప్రతిపాదనలు చర్చకు రానున్నాయి.
అలాగే, రాజధాని పరిధిలో గతంలో వివిధ సంస్థలకు కేటాయించిన భూములకు సంబంధించిన అంశాలపై నిర్ణయం తీసుకోవడంతో పాటు, మరికొన్ని సంస్థలకు కొత్తగా భూములు కేటాయించే ప్రతిపాదనలపై కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా, సూపర్ సిక్స్ హామీల అమలులో భాగంగా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాల అమలు తేదీలను ఈ మంత్రివర్గ సమావేశంలో ఖరారు చేసే అవకాశం ఉంది.