Nitish Kumar: జాతీయ గీతాన్ని అవమానించిన బీహార్ సీఎం.. నితీశ్‌కుమార్‌పై పిటిషన్లు

- జాతీయ గీతాన్ని అవమానించిన బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్
- నితీశ్ కుమార్ చర్యలను నిరసిస్తూ ముజఫర్‌పూర్‌లోని సీజేఎం కోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన ఇద్దరు న్యాయవాదులు
- నితీశ్‌కు వ్యతిరేకంగా అసెంబ్లీలో విపక్షాల ఆందోళన
- నేడు రాష్ట్ర వ్యాప్త నిరసనలకు విపక్షాలు పిలుపు
జాతీయ గీతాన్ని అవమానించిన ఘటనపై బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై కోర్టులో పిటిషన్ దాఖలైంది. పాట్నాలో ఓ క్రీడా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన జాతీయ గీతం ఆలపిస్తుండగా, ఆయన నవ్వుతూ పక్కన ఉన్న వారిని పలకరించిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను విపక్ష నేత తేజస్వీ యాదవ్ పోస్టు చేస్తూ సీఎం హోదాలో ఉండి ఇలా ప్రవర్తించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. నితీశ్ ముఖ్యమంత్రి పదవికి అనర్హుడని, వెంటనే రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.
ముజఫర్‌పూర్‌లోని సీజేఎం కోర్టులో శుక్రవారం సూరజ్ కుమార్, అజయ్ రంజన్ అనే న్యాయవాదులు నితీశ్ కుమార్‌పై పిటిషన్ దాఖలు చేశారు. పాట్నాలో గురువారం జరిగిన సెపక్ తక్రా ప్రపంచ కప్ 2025 ప్రారంభోత్సవంలో సీఎం నితీశ్‌కుమార్ జాతీయ గీతాన్ని అగౌరవపరిచారని వారు ఆరోపించారు.
జాతీయ గీతాన్ని అవమానించడం భారతీయ చట్టం ప్రకారం శిక్షార్హమైన నేరమని ఫిర్యాదుదారులు వాదించారు. భారత శిక్షాస్మృతిలోని సెక్షన్లు 298, 352, జాతీయ గౌరవ అవమానాల నిరోధక చట్టంలోని సెక్షన్లు 2, 3 కింద కేసు నమోదు చేసినట్లు న్యాయవాది సూరజ్ కుమార్ తెలిపారు. ఈ పిటిషన్‌పై విచారణను కోర్టు ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసింది.
మరో పక్క ప్రతిపక్ష పార్టీలు శుక్రవారం శాసనసభ, శాసనమండలిలో ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపాయి. దీంతో అసెంబ్లీ కార్యక్రమాలు స్తంభించాయి. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు విపక్షాలు పిలుపునిచ్చాయి. నితీశ్ కుమార్ బహిరంగ క్షమాపణలు చెప్పకపోతే ఆదివారం రాజ్ భవన్‌కు ర్యాలీగా వెళ్లి గవర్నర్‌కు వినతి పత్రం అందించనున్నట్లు విపక్ష నేతలు తెలిపారు.