Ashwini Vaishnaw: రైలు లోకో పైలట్లు శీతల పానియాలు, కొబ్బరినీళ్లు తీసుకోవడంపై ఆంక్షలు.. అశ్వినీ వైష్ణవ్ వివరణ

- శీతల పానియాలు, కొబ్బరినీళ్లు తాగవద్దంటూ దక్షిణ రైల్వే ఆదేశాలు
- ఇలాంటి ఆదేశాలు సరికాదన్న డీఎంకే, ఎండీఎంకే
- దక్షిణ రైల్వే ఆదేశాలను సవరించినట్లు అశ్వినీ వైష్ణవ్ వెల్లడి
లోకో పైలట్లు విధుల్లోకి వచ్చే ముందు శీతల పానీయాలు, కొబ్బరి నీళ్లు తీసుకోవడంపై ఎటువంటి ఆంక్షలు లేవని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు. విధుల్లోకి వచ్చే ముందు శీతల పానీయాలు, దగ్గు మందు, కొబ్బరి నీళ్లు తాగవద్దంటూ దక్షిణ రైల్వే ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు వివాదాస్పదం అయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి స్పందిస్తూ, దక్షిణ రైల్వే ఇచ్చిన ఆదేశాలను ఇప్పటికే సవరించినట్లు తెలిపారు.
రైలు డ్రైవర్లు డ్యూటీకి వచ్చే సమయంలో, డ్యూటీలో ఉన్నప్పుడు శీతల పానీయాలు, కొన్ని రకాల పండ్లు, దగ్గు మందు, కొబ్బరి నీళ్లు తాగవద్దని దక్షిణ రైల్వే ఆదేశాలు ఇచ్చిందా? అని ఎండీఎంకే ఎంపీ వైకో, డీఎంకే సభ్యుడు షణ్ముగం రాజ్యసభలో ప్రశ్నించారు. వేసవిలో ఇంజిన్ మరింత వేడెక్కడంతో డ్రైవర్లకు దప్పిక వేస్తుందని, కాబట్టి ఇలాంటి నిబంధనలు సరికాదని వారు అన్నారు. దీనిపై స్పందించిన అశ్వినీ వైష్ణవ్ పై విధంగా సమాధానం ఇచ్చారు.