Harish Rao: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో హరీశ్ రావు భేటీ... కారణం చెప్పిన మాజీ మంత్రి

- పద్మారావు గౌడ్‌తో కలిసి ముఖ్యమంత్రిని కలిసిన హరీశ్ రావు
- దాదాపు పావుగంట పాటు సమావేశం
- సికింద్రాబాద్ నియోజకవర్గ సమస్యలపై కలిసినట్లు హరీశ్ రావు వెల్లడి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు సమావేశమయ్యారు. మాజీ మంత్రి పద్మారావు గౌడ్‌తో కలిసి ఆయన అసెంబ్లీలోని ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లారు. దాదాపు పావుగంట పాటు ముఖ్యమంత్రితో మాట్లాడారు. వీరిద్దరి భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
అందుకే కలిశాం: హరీశ్ రావు
సికింద్రాబాద్‌లో నెలకొన్న సమస్యలపై చర్చించేందుకే ముఖ్యమంత్రిని కలిసినట్లు హరీశ్ రావు తెలిపారు. ముఖ్యమంత్రితో భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ, సీతాఫల్‌మండిలో పెండింగులో ఉన్న ఎస్డీఎఫ్ నిధుల కోసం తాను, పద్మారావుగౌడ్ ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు.
సీతాఫల్‌మండిలో ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల ఒకేచోట ఏర్పాటు చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ. 32 కోట్లు విడుదల చేసినట్లు ఆయన గుర్తు చేశారు. ఎన్నికల కోడ్ కారణంగా నిధులు నిలిచిపోయాయని తెలిపారు. ఆ నిధులను విడుదల చేయాలని కోరేందుకు ముఖ్యమంత్రిని కలిసినట్లు ఆయన వెల్లడించారు. తన నియోజకవర్గ సమస్యలపై మాట్లాడేందుకే పద్మారావుగౌడ్ తనను వెంటబెట్టుకొని వెళ్లారని ఆయన పేర్కొన్నారు.