Amit Shah: హిందీ ఏ భాషకూ పోటీ కాదు.. రాజకీయంగా లబ్ధి పొందేందుకే భాషా వివాదం: అమిత్ షా

- భాష పేరిట ఇప్పటికే దేశంలో చాలా విభజన వచ్చిందన్న అమిత్ షా
- ఇకపై ఎంత మాత్రం అలా జరగనివ్వబోమన్న అమిత్ షా
- తమిళనాడులో బీజేపీ అధికారంలోకి వస్తే తమిళంలో మెడికల్, ఇంజీనీరింగ్ విద్య అందిస్తామని హామీ
హిందీ ఏ భాషకూ పోటీ కాదని, అది అన్ని భాషలకూ సోదర భాష అని కేంద్ర మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. రాజకీయంగా లబ్ధి పొందేందుకు, అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే కొన్ని పార్టీలు భాషా అంశాన్ని తెరపైకి తెస్తున్నాయని ఆయన ఆరోపించారు. భాష పేరిట దేశంలో ఇదివరకే చాలా విభజన జరిగిందని, ఇకపై ఎంతమాత్రం అలా జరగనివ్వబోమని ఆయన అన్నారు.
రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ, కొన్ని రాజకీయ పార్టీలు తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం భాషను వివాదాస్పదం చేస్తున్నాయని మండిపడ్డారు. భాష పేరుతో వారు తమ అవినీతిని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. దేశంలోని అన్ని భాషలూ భారత్‌కు ఒక నిధి వంటివని ఆయన అభివర్ణించారు. భాష పేరిట విభజన తీసుకువచ్చేందుకు చేసే ప్రయత్నాలు ఏవీ సఫలం కావని అమిత్ షా పేర్కొన్నారు.
మోదీ ప్రభుత్వం రాజ్యభాషా విభాగాన్ని ఏర్పాటు చేసిందని ఆయన గుర్తు చేశారు. తెలుగు, తమిళం, పంజాబీ, అస్సామీ వంటి అన్ని భాషలకూ ప్రాచుర్యం కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశమని ఆయన తెలిపారు.
దక్షిణాది భాషలకు కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకమని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగైతే తాను గుజరాత్ నుండి, నిర్మలా సీతారామన్ తమిళనాడు నుండి ప్రభుత్వంలో మంత్రులుగా ఎలా వ్యవహరిస్తున్నామని ఆయన ప్రశ్నించారు. ఇంజినీరింగ్, మెడికల్ విద్యను తమిళంలో అందించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని రెండేళ్లుగా కోరుతున్నామని, కానీ ఆ దిశగా అడుగులు పడటం లేదని ఆయన విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే మెడికల్, ఇంజినీరింగ్ విద్యను తమిళంలో అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.