Telangana: తెలంగాణలోని పలు జిల్లాల్లో వడగండ్ల వాన

- పలు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వాన
- పలు ప్రాంతాల్లో తడిసిన ధాన్యం
- మామిడి తోటల్లో రాలిన పూత, కాయలు
తెలంగాణలోని పలు జిల్లాల్లో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. నిజామాబాద్, కరీంనగర్, మంచిర్యాల జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వాన కురిసింది. ఈ వర్షానికి పలు ప్రాంతాల్లో వరి ధాన్యం తడిసి ముద్దయింది. పలుచోట్ల మామిడి తోటల్లో పూత, పిందెలు నేలరాలాయి. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో భారీగా వడగండ్ల వాన కురిసింది.
తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వడగండ్ల వాన కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ముందే హెచ్చరించింది. రానున్న రోజుల్లో కూడా పలు జిల్లాల్లో వడగండ్ల వాన కురిసే అవకాశముంది. రేపు మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాల్లో అక్కడక్కడా వడగండ్ల వాన కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఆదిలాబాద్, కొమురంభీమ్ ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.