Harirama Jogayya: ప్రజాప్రతినిధులపై కేసు విచారణ పురోగతి మీద హైకోర్టులో విచారణ

- వివిధ కోర్టుల్లో ప్రజాప్రతినిధులపై 309కి పైగా కేసులు ఉన్నాయన్న ఏఏజీ
- విచారణలో పురోగతిపై కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కోరిన ఏఏజీ
- మార్చి 31 వరకు కేసుల పురోగతి తెలపాలని ఏఏజీకి హైకోర్టు ఆదేశం
ప్రజాప్రతినిధులపై కేసుల విచారణ పురోగతిపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. తెలంగాణలోని వివిధ కోర్టుల్లో ప్రజాప్రతినిధులపై 309కి పైగా కేసులు ఉన్నాయని అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) కోర్టుకు తెలిపారు. విచారణలో పురోగతిపై కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కోరారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ అంశంపై హైకోర్టు ప్రత్యేక ధర్మాసనం విచారణ జరిపింది.
మాజీ ఎంపీ హరిరామజోగయ్య దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని కలిపి విచారణ జరిపింది. జగన్‌పై నమోదైన సీబీఐ, ఈడీ కేసులను వేగంగా విచారించాలని హరిరామజోగయ్య గతంలో ఫిర్యాదు చేశారు.
విచారణ వేగవంతం చేయాలని హైకోర్టు ఆదేశించినట్లు హరిరామజోగయ్య తరఫు న్యాయవాది తెలిపారు. మార్చి 31వ తేదీ వరకు ఉన్న కేసుల పురోగతిని తెలపాలని ఏఏజీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.