Manda Krishna Madiga: నాడు చంద్రబాబు తల్లి ఆశీస్సులు తీసుకుని పాదయాత్ర ప్రారంభించాను: మంద కృష్ణ మాదిగ

Manda Krishna Madiga on Chandrababu Naidus Role in SC Categorization

  • మంద కృష్ణ మాదిగ ప్రెస్ మీట్
  • చంద్రబాబు వల్లే ఎస్సీ వర్గీకరణపై ఏకగ్రీవ తీర్మానం వచ్చిందని వెల్లడి
  • వర్గీకరణపై వైసీపీ ఇంకా అభిప్రాయమే చెప్పలేదని ఆరోపణ
  • గతంలో జగన్ కలిసేందుకు కూడా తమకు అనుమతి ఇవ్వలేదని వెల్లడి 

వివిధ రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ముందుకు తీసుకుపోతున్న నేపథ్యంలో, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ మీడియా ముందుకు వచ్చారు. ఏపీ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై ఏకగ్రీవ తీర్మానం చేయడాన్ని స్వాగతిస్తున్నట్టు చెప్పారు. 

1997లో తాను చంద్రబాబు తల్లి ఆశీస్సులు తీసుకుని పాదయాత్ర ప్రారంభించానని గుర్తుచేసుకున్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం చంద్రబాబు చిత్తశుద్ధితో కృషి చేశారని చెప్పారు. 1997-98లోనే తొలిసారి తీర్మానం ప్రవేశపెట్టిన ఘనత చంద్రబాబుదేనని అన్నారు. ఇచ్చిన మాట కోసం చంద్రబాబు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా న్యాయం వైపే నిలబడ్డారని కొనియాడారు. ఎస్సీ వర్గీకరణపై ఏకగ్రీవ తీర్మానంలో చంద్రబాబుదే కీలకపాత్ర అని స్పష్టం చేశారు. 

దీన్ని చారిత్రక విజయంగా భావిస్తున్నామని తెలిపారు. 30 ఏళ్ల పోరాటంలో అమరులైన వారికి ఈ విజయం అంకితం ఇస్తున్నామని చెప్పారు. తమ ఉద్యమంలో న్యాయం ఉందనే దానికి ఈ ఏకగ్రీవ తీర్మానాలే నిదర్శనం అని పేర్కొన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తమకు అండగా నిలిచారని మంద కృష్ణ మాదిగ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. 

మాదిగల ఉద్యమాన్ని గుర్తుచేస్తూ పవన్ కల్యాణ్ కూడా మద్దతు ఇచ్చారని వెల్లడించారు. ఎస్సీ వర్గీకరణపై ఏకగ్రీవ తీర్మానంలో చంద్రబాబు చతురత ఉందని, ఎస్సీ వర్గీకరణ అంశం ద్వారా చంద్రబాబు సామాజిక న్యాయం చేశారని కొనియాడారు.

ఎస్సీ వర్గీకరణపై వైసీపీ ఇప్పటికీ తమ అభిప్రాయాన్ని చెప్పలేదని అన్నారు. గతంలో కనీసం వినతిపత్రం ఇచ్చేందుకు కూడా జగన్ తమకు అనుమతి ఇవ్వలేదని ఆరోపించారు. జగన్ ఉండి ఉంటే ఎస్సీ వర్గీకరణను ఇక చూసేవాళ్లమే కాదని మంద కృష్ణ వ్యాఖ్యానించారు. 

  • Loading...

More Telugu News