CPI Narayana: చిరంజీవికి ఒక్కసారి చెబితే మానేశాడు... స్పిరిట్ అంటే అదీ!: సీపీఐ నారాయణ

- బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో సినీ తారల పేర్లు
- ఆసక్తికర విషయం వెల్లడించిన సీపీఐ నారాయణ
- గతంలో తాను చెబితే కోకాకోలా యాడ్ కు చిరు గుడ్ బై చెప్పాడని వెల్లడి
బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో సినీ తారల పేర్లు కూడా తెరపైకి రావడం పట్ల సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. గతంలో మెగాస్టార్ చిరంజీవి ఓసారి కోకాకోలా డ్రింక్ కు ప్రచారం చేశాడని, కానీ తాను ఓసారి లేఖ రాశానని, ఆ డ్రింక్ కు ప్రచారం కల్పించవద్దని చెప్పానని వెల్లడించారు.
"బాండీలో కోకాకోలా పోసి వేడి చేస్తే అది రంగు మారింది. ఇదే విషయాన్ని చిరంజీవికి వివరించాను. కోకాకోలా తాగడం అనారోగ్యమని, పిల్లలను చెడగొడుతున్నావని చెప్పాను. ఇది గనుక ఆపకపోతే చిల్డ్రన్స్ డే సందర్భంగా ధర్నా చేస్తామని చెప్పాను.
ఆదే రోజు అల్లు అరవింద్ నాకు ఫోన్ చేశాడు. ఏంది నారాయణా... చిరంజీవి గారిపై బాంబులు వేశావు అన్నాడు. నేనేం అనలేదయ్యా అని బదులిచ్చాను. మేం ఈ యాడ్ ద్వారా వచ్చే డబ్బులు చిరంజీవి రక్తనిధికి ఖర్చు పెడుతున్నామని అల్లు అరవింద్ చెప్పాడు. అడుసు తొక్కనేల కాలు కడగనేల అనుకున్నాను... రక్తం చెడగొట్టేందుకు ఓవైపు మీరు ప్రచారం చేస్తూ... చెడిపోయిన రక్తాన్ని మళ్లీ బాగు చేయడానికి ఖర్చు పెడుతున్నారా? అదేం అన్యాయమండీ అని అడిగాను.
మరుసటి రోజు మళ్లీ ఫోన్ చేశాడు. మాకు 3 నెలలు టైమ్ ఇవ్వు... మాకు అగ్రిమెంట్ ఉంది అని చెప్పాడు. కరెక్ట్ గా మూడు నెలల తర్వాత ఆపేశాడు. మళ్లీ చిరంజీవి ఎప్పుడూ కోకాకోలా యాడ్ లో నటించలేదు. ఎంత డబ్బులు ఇస్తామన్నా ఆయన దాని జోలికి వెళ్లలేదు... అలా ఉండాలి స్పిరిట్" అని వివరించారు.
ఢిల్లీలోని ఆంధ్రా భవన్ వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో నారాయణ మాట్లాడుతూ సినీ పరిశ్రమ ద్వారా వచ్చిన ఖ్యాతిని అడ్డం పెట్టుకొని డబ్బు సంపాదన వ్యామోహంతో అనైతిక చర్యలకు పాల్పడదాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.
బెట్టింగ్ యాప్ ల ను ప్రమోట్ చేయడం ద్వారా యువత జీవితాలను నాశనం చేస్తున్నారని ఆక్షేపించారు. గతంలో అల్లూరి రామలింగయ్య వంటి వారు కళను సమాజ అభివృద్ధి కి ఉపయోగ పరచారని గుర్తు చేశారు.సినీ పరిశ్రమలో సక్రమంగా వచ్చే సంపాదన ఉన్నవారు కూడా మరింత సంపాదన కోసం సమాజాన్ని పక్కదారి పట్టించే అనేక అనైతిక ప్రకటనల్లో నటించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమకే తెలియకుండా బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేశామని ఒకరు, చట్ట పరంగా అవకాశం ఉంది కాబట్టి చేశామని ఒకరు చెబుతున్నారని మండిపడ్డారు. మీకు ఉన్న పాపులరిటి కారణంగా మీరు నటించే, ప్రమోట్ చేసే అంశాలను ప్రజలు సులభంగా నమ్మి తీవ్రంగా ఇబ్బంది పడుతున్న విషయాన్ని గుర్తించాలన్నారు.
బెట్టింగ్ యాప్ లకు వేలాది మంది యువత బలి అవుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నా వాటిని ఇంకా ప్రమోట్ చేయడం నేరమేనని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం కఠినముగానే చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. గుట్కా, పాన్ మసాలాలు, తప్పుడు పద్ధతుల్లో సాగే రియల్ ఎస్టేట్, మోసపూరిత బంగారు వ్యాపారాల ప్రకటనల్లో నటించి సమాజానికి కీడు చేస్తున్నారని పేర్కొన్నారు.
బెట్టింగ్ యాప్ లకు వేలాది మంది యువత బలి అవుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నా వాటిని ఇంకా ప్రమోట్ చేయడం నేరమేనని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం కఠినముగానే చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. గుట్కా, పాన్ మసాలాలు, తప్పుడు పద్ధతుల్లో సాగే రియల్ ఎస్టేట్, మోసపూరిత బంగారు వ్యాపారాల ప్రకటనల్లో నటించి సమాజానికి కీడు చేస్తున్నారని పేర్కొన్నారు.