Harish Rao: హరీశ్ రావు 'బుద్ధిమాంద్యం' వ్యాఖ్యలపై శాసనసభలో దుమారం

- బుద్ధిమాంద్యం వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలన్న భట్టి విక్రమార్క
- రేవంత్ రెడ్డి బట్టలూడదీసి కొడతానంటే వారించలేదన్న హరీశ్ రావు
- బుద్ధిమాంద్యం అంటే తప్పెలా అవుతుందన్న హరీశ్ రావు
మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు శాసనసభలో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. హరీశ్ రావు సభలో మాట్లాడుతూ 'బుద్ధిమాంద్యం' అని వ్యాఖ్యానించడంపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీశ్ రావు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
హరీశ్ రావు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకుండా మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తరహాలో వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
అందుకు హరీశ్ స్పందిస్తూ.. బుద్ధిమాంద్యం అనే పదం ఏమైనా తప్పా అని ఆవేదన వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బట్టలూడదీసి కొడతా, బట్టలిప్పి ఊరేగిస్తానని మాట్లాడితే వారిని ఎందుకు వారించలేదని ఆయన స్పీకర్‌ను అడిగారు. తాను బుద్ధిమాంద్యం అంటే తప్పెలా అవుతుందని, దీనిని వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు.
హరీశ్ రావు విజ్ఞులైతే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని భట్టివిక్రమార్క సూచించారు. సభాపతితో వాదన సరికాదని ఆయన అన్నారు.
హరీశ్ రావు స్పందిస్తూ, స్పీకర్ పట్ల తమకు గౌరవభావం ఉందని అన్నారు. స్పీకర్ అందరికీ పెద్దన్నలాంటి వారని, తమ ఆవేదనను స్పీకర్ ద్వారా ప్రభుత్వానికి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు.