Hasan Nawaz: పాక్ జట్టులో కొత్త స్టార్ వచ్చాడు... 44 బంతుల్లోనే సుడిగాలి సెంచరీ

- ఆక్లాండ్ లో పాక్, న్యూజిలాండ్ మధ్య మూడో టీ20
- 9 వికెట్ల తేడాతో పాక్ ఘనవిజయం
- వరుసగా రెండు ఓటముల తర్వాత గెలుపుతో మురిసిన పాక్
- పాక్ విజయంలో మెరిసిన 22 ఏళ్ల యువ ఓపెనర్ హసన్ నవాజ్
ఇటీవల కాలంలో పాకిస్థాన్ జట్టు క్రికెట్ జట్టు వరుస పరాజయాలతో కళ తప్పింది. స్టార్ ఆటగాళ్లెవరూ రాణించకపోవడంతో పాక్... విజయాలకు ఆమడదూరంలో ఉంటోంది. తాజాగా న్యూజిలాండ్ పర్యటనలోనూ వరుసగా రెండు టీ20 మ్యాచ్ ల్లో ఓటమిపాలైంది. మూడో మ్యాచ్ లో కూడా పాక్ కు ఓటమి తప్పదు అని అందరూ భావించినా... యువ ఆటగాడు హసన్ నవాజ్ మాత్రం చిచ్చరపిడుగులా ఆడి పాకిస్థాన్ ను గెలిపించాడు.
ఆక్లాండ్ లోని ఈడెన్ పార్క్ మైదానం హసన్ దూకుడుకు వేదికగా నిలిచింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 19.5 ఓవర్లలో 204 పరుగులకు ఆలౌట్ అయింది. కివీస్ జట్టులో చాప్ మన్ 44 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సులతో 94 పరుగులు చేశాడు.
అసలే భారీ లక్ష్యం... పాకిస్థాన్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది... మరో ఓటమి ఖాయం అని డిసైడయ్యారు. కానీ, 22 ఏళ్ల విధ్వంసక ఓపెనర్ హసన్ నవాజ్ న్యూజిలాండ్ బౌలర్లను ఊచకోత కోస్తూ సెంచరీతో మోత మోగించాడు. నవాజ్ మొత్తం 45 బంతుల్లో 10 ఫోర్లు, 7 సిక్సర్లతో 105 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దాంతో పాక్ జట్టు 205 పరుగుల లక్ష్యాన్ని కేవలం 1 వికెట్ నష్టపోయి 16 ఓవర్లలోనే ఛేదించింది.
ఓపెనర్ మహ్మద్ హరీస్ 20 బంతుల్లో 41 పరుగులు చేసి అవుటయ్యాడు. కెప్టెన్ సల్మాన్ ఆఘా 31 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులతో అజేయంగా 51 పరుగులు చేశాడు. ఆఘా స్కోరులో 6 ఫోరుల్, 2 సిక్సులు ఉన్నాయి. హరీస్, ఆఘాలతో భారీ భాగస్వామ్యాలు నమోదు చేసిన హసన్ నవాజ్ ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టాడు.
విదేశీ గడ్డపై మాత్రం భయం లేకుండా విరుచుకుపడడం పట్ల క్రికెట్ పండితులు... మరో షాహిద్ అఫ్రిది అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. గతంలో షాహిద్ అఫ్రిది ఫాస్టెస్ట్ సెంచరీతో వరల్డ్ రికార్డు సాధించి ఒక్కసారిగా స్టార్ డమ్ అందుకున్నాడు. ఇప్పుడు హసన్ కు కూడా అఫ్రిదిలానే మంచి భవిష్యత్తు ఉందని అంటున్నారు.