NPCI: ఇనాక్టివ్ ఫోన్ నెంబర్లకు యూపీఐ సేవల నిలిపివేత

- ఇనాక్టివ్ నెంబర్ల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం
- మోసాలను అరికట్టడానికి NPCI నిర్ణయం.
- ఏప్రిల్ 1 నుంచి అమలు
కేంద్రం ఇనాక్టివ్ ఫోన్ నెంబర్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. క్రియాశీలకంగా లేని ఫోన్ నెంబర్లు, లేదా ఇతరులకు కేటాయించిన కొన్ని మొబైల్ నంబర్లకు ఏప్రిల్ 1నుంచి యూపీఏ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) సేవలను నిలిపివేయనున్నట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ప్రకటించింది. ఈ మేరకు అన్ని బ్యాంకులు మరియు పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లకు ఆదేశాలు జారీ చేసింది.
UPI వినియోగంలో మొబైల్ నంబర్ యొక్క ప్రాముఖ్యతను గుర్తించి, అనధికార లావాదేవీలు మరియు మోసాలను నిరోధించడానికి NPCI ఈ నిర్ణయం తీసుకుంది. OTP ధృవీకరణ వంటి భద్రతా చర్యల కోసం UPI సేవలు మొబైల్ నంబర్‌పై ఆధారపడతాయి. టెలికాం సంస్థలు ఎక్కువ కాలం ఉపయోగించని మొబైల్ నంబర్లను తిరిగి ఇతరులకు కేటాయిస్తుంటాయి. దీని వలన, ఆ నంబర్లతో లింక్ చేయబడిన UPI ఖాతాలు దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉంది.
ఈ సమస్యను పరిష్కరించడానికి, Google Pay, PhonePe, Paytm వంటి ప్రముఖ UPI యాప్‌లు మరియు బ్యాంకులు ఇనాక్టివ్ గా ఉన్న మొబైల్ నంబర్లను తొలగించాల్సి ఉంటుంది. ఒకవేళ మీ నంబర్ ఈ జాబితాలో ఉంటే, UPI సేవలను నిలిపివేస్తున్నట్లు మీకు నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ వచ్చినప్పటికీ మీ నంబర్ ఇనాక్టివ్ గానే ఉంటే, మీ UPI సేవలు పూర్తిగా నిలిపివేయబడతాయి.
మొబైల్ నంబర్ మార్చిన తర్వాత బ్యాంక్ రికార్డులను పునరుద్ధరించనివారిపై, UPIతో లింక్ చేసిన నంబర్లను ఉపయోగించని వారిపై, అలాగే తమ పాత నంబర్లను సరెండర్ చేసిన వారిపై కేంద్రం తాజా నిర్ణయం ప్రభావం చూపుతుంది.
మీ UPI సేవలు నిలిపివేయబడకుండా ఉండాలంటే, మీ మొబైల్ నంబర్ ప్రస్తుతం వాడుకలో ఉందో లేదో ధృవీకరించుకోవాల్సి ఉంటుంది. మీ బ్యాంకు నుంచి OTPలు మరియు SMS హెచ్చరికలు అందుతున్నాయో లేదో క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోవాలి. మీ బ్యాంక్ ఖాతాకు లింక్ చేయబడిన మొబైల్ నంబర్ ఎల్లప్పుడూ అప్ డేట్ అయి ఉండేలా చూసుకోండి. దీని కోసం నెట్ బ్యాంకింగ్ ఉపయోగించడం కానీ, లేదా నేరుగా బ్యాంకును సందర్శించడం కానీ చేయాలి.