Amit Shah: ఉగ్రవాదం పట్ల కఠిన వైఖరి అవలంబిస్తున్నాం: అమిత్ షా

Amit Shah on Indias Strong Stance Against Terrorism

  • కశ్మీర్‌లో ఇప్పుడు సాధారణ పరిస్థితులు నెలకొన్నాయన్న కేంద్ర హోం మంత్రి
  • యువత ఉద్యోగాలు చేసుకుంటోంది, సినిమా హాళ్లు నిండుతున్నాయని వ్యాఖ్య
  • గత ప్రభుత్వాలు ఉగ్రవాదం పట్ల మెతకవైఖరిని అనుసరించాయని ఆరోపణ

నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదం పట్ల కఠిన వైఖరిని అవలంబిస్తోందని కేంద్ర మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. కశ్మీర్‌లో ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని ఆయన తెలిపారు. రాజ్యసభలో ఆయన ప్రసంగిస్తూ, యువత ఉద్యోగాలు చేసుకుంటున్నారని, సినిమా హాళ్లు కూడా నిండుతున్నాయని అన్నారు. గత ప్రభుత్వాలు ఉగ్రవాదం పట్ల మెతకవైఖరిని అనుసరించాయని ఆయన ఆరోపించారు.

జమ్ము కశ్మీర్, ఈశాన్య భారతంలోని ఉగ్రవాదం, తీవ్రవాదం దేశ వృద్ధికి ఆటంకాలని, వాటి వల్ల 92 వేల మంది ప్రాణాలు కోల్పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్డీయే పాలనలో కశ్మీర్‌లో ఉగ్రవాద మరణాలు 70 శాతం తగ్గాయని తెలిపారు. ఆర్టికల్ 370ని రద్దు చేయడం ద్వారా 'ఒకే రాజ్యాంగం - ఒకే జెండా' అనే రాజ్యాంగ నిర్మాతల కలను మోదీ ప్రభుత్వం నెరవేర్చిందని అన్నారు. 2019 నుంచి 2024 వరకు అక్కడి యువతకు 40 వేల ప్రభుత్వ ఉద్యోగాలు లభించాయన్నారు.

యురి, పుల్వామా ఘటనలు జరిగిన కొద్ది రోజుల వ్యవధిలోనే మెరుపు దాడులు, వైమానిక దాడులతో ఎన్డీయే ప్రభుత్వం పాకిస్థాన్‌కు గట్టిగా బదులిచ్చిందని ఆయన అన్నారు. 2026 మార్చి 31 నాటికి వామపక్ష తీవ్రవాదం అంతమవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాజకీయ భావజాలం మద్దతున్న ఉగ్రవాదం విస్తరించకుండా అడ్డుకుంటామని స్పష్టం చేశారు.

Amit Shah
Terrorism
India
Kashmir
Article 370
Pulwama Attack
Uri Attack
Modi Government
National Security
Counter-terrorism
  • Loading...

More Telugu News