Revanth Reddy: వంటంతా అయ్యాక గంటె తిప్పినట్లుగా రేవంత్ రెడ్డి తీరు ఉంది: హరీశ్ రావు

Harish Rao Slams Revanth Reddys Government on Job Creation

  • బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన ఉద్యోగాలను కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుందన్న హరీశ్ రావు
  • నిరుద్యోగుల ఆశలపై భట్టి విక్రమార్క బకెట్ల కొద్ది నీళ్లు చల్లారని విమర్శ
  • నియామకాలపై దుష్ప్రచారం చేయవద్దన్న హరీశ్ రావు

వంటంతా అయ్యాక గంటె తిప్పినట్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారశైలి ఉందని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన ఉద్యోగాలను కాంగ్రెస్ తమ ఖాతాలో వేసుకుంటోందని విమర్శించారు. శాసనసభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి పదిహేను నెలల అవుతున్నా ఆ ఉద్యోగాలు ఎక్కడ అని ప్రశ్నించారు.

భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరుద్యోగుల ఆశలను వమ్ము చేసిందని విమర్శించారు. ఈ ఏడాదైనా ఉద్యోగాలు ఇస్తారని ఎదురుచూసిన వారి ఆశలపై భట్టి విక్రమార్క బకెట్ల కొద్ది నీళ్లు చల్లారని ఎద్దేవా చేశారు. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి రాహుల్ గాంధీ వరకు అశోక్‌నగర్ చుట్టూ ప్రదక్షిణ చేశారని ధ్వజమెత్తారు.

ఉద్యోగాలు ఇచ్చి మాట నిలబెట్టుకుంటామని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగులను పార్టీ కార్యకర్తలుగా మార్చుకొని ఇంటింటికి తిప్పారని, కానీ నేడు నిండా ముంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ ఉద్యమం జరిగిందని తెలిపారు.

60 నుంచి 80 శాతం మాత్రమే ఉండే స్థానిక రిజర్వేషన్‌ను 95 శాతానికి సాధించింది కేసీఆరే అన్నారు. తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలనలో లక్షా 62 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని వెల్లడించారు. ఒక్క ఉద్యోగం ఇవ్వలేదనే తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలని హితవు పలికారు. అన్నీ అబద్దాలే చెబుతున్నారని, ఉద్యోగాలపై ఇకనైనా తప్పుడు ప్రచారం మానుకోవాలని సూచించారు. బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగాలు ఇస్తే, కాంగ్రెస్ నియామక పత్రాలు ఇచ్చిందని మండిపడ్డారు. కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ ఏమైందని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News