Vishnuvardhan Reddy: తిరుపతిలో ముంతాజ్ హోటల్ అనుమతులు రద్దు చేయడం చక్కటి నిర్ణయం; విష్ణువర్ధన్ రెడ్డి

- తిరుపతిలో ఏడు కొండలను ఆనుకుని ముంతాజ్ హోటల్ కు గతంలో భూ అనుమతులు
- ఈ అనుమతులు రద్దు చేయాలని నిర్ణయించుకున్నామని నేడు చంద్రబాబు వెల్లడి
- చంద్రబాబు నిర్ణయం శుభపరిణామం అన్న విష్ణువర్ధన్ రెడ్డి
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ తిరుమల పర్యటన సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏడు కొండలను ఆనుకుని గతంలో హోటల్ ముంతాజ్ కు ఇచ్చిన భూ అనుమతులను రద్దు చేయాలని నిర్ణయించినట్టు చంద్రబాబు తెలిపారు. దీనిపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు.
ఏడు కొండలను ఆనుకుని 35.32 ఎకరాలకు ముంతాజ్ హోటల్ కు ఇచ్చిన అనుమతులు రద్దు చేయడం ద్వారా తిరుమల మహత్యాన్ని కాపాడాలనుకోవడం చక్కటి నిర్ణయం అని కొనియాడారు. తిరుపతి ఏడు కొండల పాదంలో వాణిజ్య కార్యకలాపాలను అడ్డుకుని, భక్తుల విశ్వాసాన్ని పరిరక్షించేలా చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నానని విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.
గతంలో భక్తుల మనోభావాలను పక్కనబెట్టి హోటళ్ల పేరుతో వ్యాపార వలసలను ప్రోత్సహించారని విమర్శించారు. తిరుపతి పవిత్రతకు భంగం కలగకుండా... భక్తుల, స్వామీజీల, హిందూ సంస్థల సంకల్పానికి అనుగుణంగా చొరవ తీసుకోవడం శుభపరిణామం అని విష్ణువర్ధన్ రెడ్డి కొనియాడారు. ధర్మం గెలిచింది... వ్యాపారం ఓడిందని స్పష్టం చేశారు.