Central Minister Annapurna Devi: మహిళ ఛాతిని తాకడం అత్యాచారం కాదన్న న్యాయమూర్తి... కేంద్ర మంత్రి ఆగ్రహం

- 2021లో బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన యువకులు
- కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన యూపీ పోలీసులు
- అలహాబాద్ కోర్టుకు చేరిన కేసు
- నిందితులకు అనుకూలంగా తీర్పు
- ఇలాంటి తీర్పు సమాజంలోకి తప్పుడు సందేశాన్ని తీసుకువెళుతుందని కేంద్ర మంత్రి ఆగ్రహం
మహిళ ఛాతిని తాకడం అత్యాచారం కిందకు రాదని అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తీర్పు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని, దీనిని పునఃపరిశీలించాలని సుప్రీంకోర్టును ఆమె కోరారు. ఇలాంటి తీర్పుల వల్ల సమాజంలోకి తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉందని కేంద్ర మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు.
2021 నవంబర్ నాటి లైంగిక వేధింపుల కేసు విచారణ సందర్భంగా అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ మిశ్రా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆయన వ్యాఖ్యలు నిందితులకు అనుకూలంగా ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తాయి.
ఉత్తర ప్రదేశ్‌లోని కసగంజ్ ప్రాంతానికి చెందిన ఒక మహిళ, తన 11 ఏళ్ల కుమార్తెతో కలిసి బంధువుల ఇంటి నుంచి తిరిగి వస్తుండగా అదే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు వారిని వెంబడించారు. బాలికను ఇంటి వద్ద దింపుతామని నమ్మించి ద్విచక్ర వాహనంపై ఎక్కించుకున్నారు. మార్గమధ్యలో ఆ యువకులు బాలికపై అత్యాచారానికి ప్రయత్నించారని, అసభ్యంగా తాకుతూ వేధింపులకు గురి చేశారని ఆరోపణలు ఉన్నాయి. బాలిక కేకలు వేయడంతో అటుగా వెళుతున్న కొందరు రావడంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.
బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణ అలహాబాద్ హైకోర్టుకు చేరింది. ఇటీవల విచారణ జరిపిన జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ మిశ్రా, మహిళ ఛాతిని తాకినంత మాత్రాన అది అత్యాచారం కిందకు రాదని పేర్కొన్నారు. నిందితులకు అనుకూలంగా తీర్పు వెలువరించారు. ఈ తీర్పుపై కేంద్ర మంత్రి తీవ్రంగా స్పందిస్తూ, దీనిని పరిశీలించాలని సుప్రీంకోర్టును కోరారు.