NMD Farooq: మంత్రి ఫరూఖ్ కు భార్యావియోగం... దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చంద్రబాబు, పవన్, లోకేశ్

- కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మంత్రి ఫరూఖ్ భార్య
- హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స
- ఈ ఉదయం కన్నుమూత
- సంతాపం తెలిపిన కూటమి పెద్దలు
ఏపీ మైనారిటీ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూఖ్ కు భార్యావియోగం కలిగింది. ఆయన భార్య షహనాజ్ హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ నేపథ్యంలో, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
రాష్ట్ర మంత్రి ఎన్ఎండీ ఫరూఖ్ అర్ధాంగి షహనాజ్ మరణించారని తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యానని సీఎం చంద్రబాబు తెలిపారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మృతి చెందడం ఆ కుటుంబానికి తీరని లోటు అని పేర్కొన్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానని, ఈ కష్ట సమయంలో గుండె నిబ్బరంతో ఉండాలని మంత్రి ఫరూఖ్ ను కోరుతున్నానని చంద్రబాబు పేర్కొన్నారు.
ఏపీ న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూఖ్ అర్ధాంగి షహనాజ్ కన్నుమూశారని తెలిసి చింతించానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు. జీవిత భాగస్వామి దూరమైన బాధను తట్టుకునే మనోధైర్యాన్ని ఫరూఖ్ గారికి ఇవ్వాలని దేవుడ్ని కోరుకుంటున్నానని, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని పవన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
మంత్రి ఎన్ఎండీ ఫరూఖ్ గారి అర్ధాంగి షహనాజ్ గారు పవిత్ర రంజాన్ మాసంలో ఇంతిఖాల్ అయ్యారని మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. ఆమెకు జన్నత్ లో ఉన్నతమైన స్థానం ప్రసాదించాలని, ఆమె ఆత్మకు శాంతి కలగాలని అల్లాను ప్రార్థిస్తున్నానని తెలిపారు. ఫరూఖ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని లోకేశ్ పేర్కొన్నారు.