Rohit Sharma: రోహిత్‌ను అవమానించిన పీఎస్ఎల్ టీమ్.. ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయొద్దంటూ ఫ్యాన్స్ ఫైర్!

- పీఎస్ఎల్ ఫ్రాంచైజీ ముల్తాన్ సుల్తాన్స్ చేసిన పనిపై క్రికెట్ ఫ్యాన్స్ గుస్సా
- రోహిత్ వాయిస్ ఓవర్‌తో పీఎస్ఎల్ మస్కట్‌తో వీడియోను రూపొందించిన టీమ్
- లావుగా ఉన్న మస్కట్‌ను ఉపయోగించి హిట్‌మ్యాన్‌పై బాడీ షేమింగ్
పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)-2025 సీజన్ ఏప్రిల్ 11 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ కారణంగా ప్రతియేటా ఫిబ్రవరిలో జరగాల్సిన ఈ టోర్నీ ఏప్రిల్‌కి వెళ్లిపోయింది. దీంతో తొలిసారి ఇటు రేపటి నుంచి జరగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)తో కూడా పీఎస్ఎల్‌కు పోటీ ఎదురుకానుంది.
ఇదిలాఉంటే... పీఎస్ఎల్ ఫ్రాంచైజీ ముల్తాన్ సుల్తాన్స్ చేసిన ఓ పని ఇప్పుడు భారత అభిమానుల ఆగ్రహానికి దారి తీసింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వాయిస్ ఓవర్‌ను ఉపయోగిస్తూ ముల్తాన్ సుల్తాన్ పీఎస్ఎల్ మస్కట్‌తో ఓ వీడియోను రూపొందించింది. లావుగా ఉన్న మస్కట్‌ను ఉపయోగించి హిట్‌మ్యాన్‌ను బాడీ షేమింగ్ చేసిందని క్రికెట్ ఫ్యాన్స్ ఫైరవుతున్నారు. ఈ వీడియోపై తమదైనశైలిలో స్పందిస్తున్నారు.
"ఇది అత్యంత సిగ్గుమాలిన చర్య. వరుసగా రెండు ఐసీసీ ట్రోఫీలు గెలిపించిన కెప్టెన్‌పై బాడీ షేమింగ్ చేయడం భావ్యం కాదు. ముందు మీరు ఆటపరంగా మెరుగవ్వండి" అని ఒకరు... "ప్రస్తుత పరిస్థితుల్లో కనీసం ఒక్క ఐసీసీ ట్రోఫీనైనా గెలవండి. ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తే వచ్చేదేమీ లేదు. నాణ్యమైన క్రికెట్ ఆడితేనే టైటిళ్లు వస్తాయి" అని మరొకరు... "ఆ వీడియో నుంచి రోహిత్ వాయిస్‌ను తీసేయాలి. ఇంతకుముందు బ్రాడ్ హాగ్ విషయంలో రచ్చ చేసిన పాక్ పెద్దలు ఇప్పుడు మాట్లాడాలి" అని ఇంకొకరు కామెంట్ చేశారు.
ఇటీవల టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ నెగ్గిన అనంతరం రోహిత్ శర్మ మీడియా సమావేశంలో మాట్లాడాడు. ఆ ప్రెస్ మీట్ లో మాట్లాడిన మాటలనే ఇప్పుడు పీఎస్ఎల్ టీమ్ ముల్తాన్ సుల్తాన్స్ తన మస్కట్ కు వాయిస్ ఓవర్ గా వాడుకుంది.