Mahesh Babu: కూతురు సితారతో మహేశ్ బాబు యాడ్.. క్యూట్ వీడియో చూశారా?

తన తండ్రి మహేశ్ బాబుతో కలిసి సితార తాజాగా ఓ యాడ్‌లో నటించింది. ఈ యాడ్ తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో సితార-మహేశ్‌ను చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. షాపింగ్ బాగా ఎంజాయ్ చేశాం కదా అంటూ మహేశ్ అనగానే... అవును నాన్నా అంటూ ఆయనపై ఓ డ్రెస్ విసిరేస్తుంది సితార.
దాంతో వెంటనే మహేశ్ కాస్ట్యూమ్ మారిపోతుంది. అలా మహేశ్ కూడా సితారపై బట్టలు విసురుతారు. అలా ఒకరిపై ఒకరు బట్టలు విసురుకుంటూ తండ్రీకూతురు కొత్త కాస్ట్యూమ్స్‌లో కనిపిస్తూ సందడి చేస్తుంటారు. ప్రస్తుతం ఈ యాడ్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇక ఈ యాడ్‌లో మహేశ్ కొంచెం గడ్డంతో క్లాసిక్ లుక్‌లో కనిపించారు. ఇక సితార అయితే చిరునవ్వులతో ఎంతో క్యూట్‌గా కనిపించింది.
కాగా, మహేశ్ బాబు సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్‌లో ఓ మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రం ఎస్ఎస్29 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతోంది. సూపర్ స్టార్ పక్కన ప్రియాంకా చోప్రా నటిస్తున్న ఈ సినిమాలో కీలక పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించనున్నారు.
ఈ చిత్రాన్ని టాలీవుడ్ సీనియర్ నిర్మాత కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీ యాక్షన్ అడ్వెంచర్‌గా ఉంటుందని కథా రచయిత విజయేంద్రప్రసాద్ ఇప్పటికే వెల్లడించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా భాగం కానున్నారు.