Suresh Raina: ఐపీఎల్‌లో అలా చేస్తే టీమిండియాలో చోటు.. సురేశ్ రైనా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

Suresh Raina Predicts Team India Selection Based on IPL Performance

  • రేప‌టి నుంచి ఐపీఎల్ 18వ సీజ‌న్
  • ఈ సీజ‌న్‌లో 500 ర‌న్స్‌ చేస్తే భార‌త జ‌ట్టులో చోటు ద‌క్కే అవ‌కాశ‌మ‌న్న రైనా
  • వ‌ర్త‌మానంలో ఉండి ఆట‌పై దృష్టిపెడితే చాలు అవ‌కాశాలు వాటంతట‌వే వ‌స్తాయ‌ని వెల్ల‌డి
  • తిల‌క్ వ‌ర్మ‌, జైస్వాల్‌, రింకూకు తాను పెద్ద అభిమానిన‌న్న మాజీ క్రికెట‌ర్‌

రేప‌టి నుంచి ఐపీఎల్ 18వ సీజ‌న్ ప్రారంభం కానుంది. ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా కోల్‌క‌తా, బెంగ‌ళూరు మ‌ధ్య జ‌రిగే మ్యాచ్‌తో టోర్నీకి తెర‌లేవ‌నుంది. ఈ క్ర‌మంలో టీమిండియా మాజీ క్రికెట‌ర్ సురేశ్ రైనా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ఈ ఐపీఎల్ సీజ‌న్‌లో 500 ప‌రుగులు చేస్తే భార‌త జ‌ట్టులో చోటు ద‌క్కే అవ‌కాశ‌ముంద‌ని అన్నాడు. ఐపీఎల్ కేవ‌లం భార‌త్‌లోనే కాకుండా ప్ర‌పంచ‌వ్యాప్తంగా గుర్తింపు పొందింద‌న్నాడు. 

యువ ఆట‌గాళ్లు తిల‌క్ వ‌ర్మ‌, య‌శ‌స్వి జైస్వాల్‌, రింకూ సింగ్‌కు తాను పెద్ద అభిమానినని చెప్పాడు. ఇప్పుడు వ‌స్తున్న క్రికెట‌ర్లు అద్భుత‌మైన టాలెంట్‌తో అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అడుగు పెడుతున్నార‌ని తెలిపాడు. ఇప్ప‌టికే చాలా మంది ప్లేయ‌ర్లు త‌మ టాలెంట్‌ను ప్ర‌ద‌ర్శించి అంత‌ర్జాతీయ టోర్నీల్లో స‌త్తా చాటార‌ని పేర్కొన్నాడు. 

2024లో టీ20 ప్ర‌పంచ‌క‌ప్ గెలిచిన టీమిండియా, ఈ ఏడాది ఛాంపియ‌న్స్ ట్రోఫీ గెల‌వ‌డం చాలా బాగుంద‌న్నాడు. వ‌రుస‌గా రెండు ఐసీసీ టోర్నీలు గెల‌వ‌డం మాములు విష‌యం కాద‌న్నాడు. ఈ సంద‌ర్భంగా రైనా యంగ్ ప్లేయ‌ర్ల‌కు కీల‌క సూచ‌న చేశాడు. వ‌ర్త‌మానంలో ఉండి ఆట‌పై దృష్టిపెడితే చాలు అవ‌కాశాలు వాటంతట‌వే వ‌స్తాయ‌న్నాడు. నిల‌క‌డ‌గా ఆడితే త‌ప్ప‌కుండా గుర్తింపు ల‌భిస్తుంద‌ని తెలిపాడు. 

ఐపీఎల్ ఒక సీజ‌న్‌లో 500 ర‌న్స్ చేస్తే త‌ప్ప‌కుండా జాతీయ జ‌ట్టులో ఆడే అవ‌కాశం వ‌స్తుంద‌న్నాడు. ఐపీఎల్ వంటి భారీ వేదిక‌పై మంచి ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిస్తే వెన‌క్కి తిరిగి చూసుకోవాల్సిన అవ‌సరం ఉండ‌ద‌న్నాడు. ఇక మిస్ట‌ర్ ఐపీఎల్‌గా పేరొందిన రైనా... 2007 టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్, 2011 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌, 2013 ఛాంపియ‌న్స్ ట్రోఫీ గెలిచిన భార‌త జట్టులో స‌భ్యుడు అనే విష‌యం తెలిసిందే. 

  • Loading...

More Telugu News