Miss World: హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీలు.. ప్రభుత్వ ఖర్చు రూ. 27 కోట్లు

Hyderabad to Host Miss World 2024 A 54 Crore Spectacle
  • మే 7వ తేదీ నుంచి 24 రోజులపాటు పోటీలు
  • గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఆరంభ వేడుకలు
  • మే 31న హైటెక్స్‌లో మిస్ వరల్డ్ ఫైనల్స్
హైదరాబాద్‌లో మే 7 నుంచి 24 రోజులపాటు జరగనున్న మిస్ వరల్డ్ పోటీలకు ప్రభుత్వం రూ. 27 కోట్లు ఖర్చు చేయనుంది. గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో ప్రారంభ వేడుకలు జరగనుండగా, మే 31న హైటెక్స్‌లో మిస్ వరల్డ్ ఫైనల్స్ నిర్వహిస్తారు. ఈ పోటీల్లో మొత్తం 140 దేశాల నుంచి అందగత్తెలు పాల్గొంటారు. ఈ పోటీలకు మొత్తంగా రూ. 54 కోట్లు ఖర్చు కానుండగా, ప్రభుత్వ శాఖలు తమ వాటాగా రూ. 27 కోట్లు ఖర్చు చేయనున్నాయి. మిగతా రూ. 27 కోట్లను మిస్ వరల్డ్ సంస్థ ఖర్చు చేస్తుంది. ప్రభుత్వ వాటాగా ఉన్న రూ. 27 కోట్లను స్పాన్సర్ల ద్వారా సమీకరిస్తారు.

మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించిన వివరాలను పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, మిస్ వరల్డ్ లిమిటెడ్ సీఈవో జూలియా మోర్లే మీడియాకు వెల్లడించారు. తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించడం ద్వారా రాష్ట్రంలో ఉపాధి, పెట్టుబడి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. తెలంగాణకు ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకొచ్చేందుకు 72వ మిస్ వరల్డ్ పోటీలు తోడ్పడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.  

మిస్‌ వరల్డ్‌ లిమిటెడ్‌ సీఈఓ జూలియా మోర్లే మాట్లాడుతూ ఈ పోటీలు అందం కంటే అంతర్జాతీయ సంస్కృతి, సాధికారతకు ప్రతీకగా నిలుస్తాయని పేర్కొన్నారు. మిస్‌ వరల్డ్‌- 2024 క్రిస్టినా మాట్లాడుతూ.. గతేడాది తాను ఇక్కడే మిస్ వరల్డ్ కిరీటం అందుకున్నట్టు చెప్పారు. తన హృదయంలో ఇండియాకు ప్రత్యేక స్థానం ఉందని పేర్కొన్నారు. చీర కట్టుకోవడం తనకు సంతోషాన్ని ఇచ్చిందని వివరించారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా పోటీలు నిర్వహిస్తామని పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సభర్వాల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
Miss World
Miss World 2024
Hyderabad
Telangana Tourism
Government Spending
Julia Morley
Cristina
Gachibowli
Hitex
India

More Telugu News