PM Modi: ప్రధాని మోదీ విదేశీ పర్యటనల ఖర్చు రూ. 258కోట్లు

- రాజ్యసభలో ప్రధాని విదేశీ పర్యటనల ఖర్చుపై ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే ప్రశ్న
- బదులిచ్చిన విదేశాంగ శాఖ సహాయ మంత్రి పబిత్ర మార్గెరిటా
- 2022 మే నుంచి 2024 డిసెంబర్ వరకు ప్రధాని 38 విదేశీ పర్యటనలు
- వీటికి రూ. 258కోట్లు ఖర్చయినట్లు వెల్లడి
ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనల ఖర్చును కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. రాజ్యసభలో ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే ప్రధాని విదేశీ పర్యటనల ఖర్చును తెలపాలని కోరగా విదేశాంగ శాఖ బదులిచ్చింది. గత మూడు సంవత్సరాలుగా ప్రధానమంత్రి విదేశీ పర్యటనల ఏర్పాట్లపై భారత రాయబార కార్యాలయాలు చేసిన మొత్తం ఖర్చును, హోటల్ ఏర్పాట్లు, కమ్యూనిటీ రిసెప్షన్లు, రవాణా, ఇతర ఖర్చుల వివరాలను ఆయన అడిగారు.
ఖర్గే అడిగిన ప్రశ్నకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి పబిత్ర మార్గెరిటా సమాధానం ఇచ్చారు. 2022 మే నుంచి 2024 డిసెంబర్ వరకు ప్రధాని 38 విదేశీ పర్యటనలకు వెళ్లగా రూ. 258కోట్లు ఖర్చయినట్లు తెలిపారు. ఇందులో అత్యధికంగా 2023 జూన్‌లో జరిగిన అమెరికా పర్యటనకు రూ.22కోట్లు ఖర్చు అయినట్లు వెల్లడించారు. అదే 2024 సెప్టెంబర్ లో యూఎస్ పర్యటనకు రూ.15.33కోట్లు ఖర్చయిందన్నారు.
కాగా, 2022 నుంచి 2024 మధ్య ప్రధాని మోదీ సందర్శించిన విదేశీ దేశాల జాబితాలో అమెరికా, జపాన్, జర్మనీ, కువైట్, డెన్మార్క్, ఫ్రాన్స్, యూఏఈ, ఉజ్బెకిస్థాన్, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, ఈజిప్ట్, దక్షిణాఫ్రికా, గ్రీస్, పోలాండ్, ఉక్రెయిన్, రష్యా, ఇటలీ, బ్రెజిల్, గయానా ఉన్నాయి.