Marri Rajasekhar: త్వరలోనే టీడీపీలో చేరుతున్నా.. ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్

- జగన్ వైఖరి నచ్చకే పార్టీకి రాజీనామా చేశానన్న రాజశేఖర్
- పార్టీలో తనకు అవమానాలే ఎదురయ్యాయని ఆవేదన
- తన సీటును వేరే వారికి కేటాయించినప్పుడు తనకు మాటమాత్రమైనా చెప్పలేదన్న ఎమ్మెల్సీ
వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ త్వరలోనే టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని తన నివాసంలో నిన్న పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. జగన్ వైఖరితో విసుగు చెందే పార్టీకి రాజీనామా చేసినట్టు చెప్పారు. పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా పార్టీ అభివృద్ధికి ఎంతగానో కృషి చేసినా తనకు అవమానాలే ఎదురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.
2019 ఎన్నికల్లో విజయం ఖాయమని ధీమాగా ఉన్న వేళ తన సీటును మరో వ్యక్తికి ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. పార్టీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి ఇస్తానని బహిరంగంగా హామీ ఇచ్చిన జగన్ దానిని విస్మరించి తనను మోసం చేశారని ఆరోపించారు. పార్టీలో తనకు గౌరవం దక్కలేదన్నారు. 2019లో చిలకలూరిపేట నుంచి పోటీ చేసిన వ్యక్తి 2024లో గుంటూరులో పోటీ చేశారని పేర్కొన్నారు. సీటు వేరే వారికి కేటాయించినప్పుడు మాట మాత్రమైనా తనకు చెప్పలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విశ్వసనీయత కోల్పోయిన జగన్ పద్ధతి నచ్చకే వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు రాజశేఖర్ చెప్పారు.