Eli Lilly India: మధుమేహం, ఊబకాయానికి ఒకే ఔషధం.. భారత మార్కెట్లో విడుదల.. ధర ఎంతంటే?

- ‘మౌంజారో’ ఔషధాన్ని విడుదల చేసిన ఎలీ లిల్లీ సంస్థ
- సింగిల్ డోస్ వయల్ రూపంలో అందుబాటులోకి
- వైద్యుల సిఫారసు మేరకు వారానికి ఒకసారి తీసుకుంటే డయాబెటిస్, ఊబకాయం అదుపులోకి
ఊబకాయం, మధుమేహం బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇదొక్క మనదేశం లోనే ఉన్న సమస్య కాదు.. ప్రపంచం మొత్తం మధుమేహ, ఊబకాయ రోగులతో నిండిపోతోంది. ఈ నేపథ్యంలో ఈ రెండింటికీ పనిచేసే ఔషధాన్ని ఎలీ లిల్లీ ఇండియా సంస్థ నిన్న భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని పేరు ‘మౌంజారో’. దీనికి కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ.. సీడీఎస్‌సీవో అనుమతినిచ్చింది. దీనిని సింగిల్ డోస్ వయల్ రూపంలో విడుదల చేశారు. వైద్యులు సిరఫారసు చేసిన ప్రకారం వారానికి ఒకసారి తీసుకుంటే సరిపోతుంది.
ఈ ఔషధంలో ఉండే ‘టిర్జెపటైడ్’ మన శరీరంలోని జీఐపీ (గ్లూకోజ్ డిపెండెంట్ ఇన్సులిన్ ట్రోపిక్ పాలీపెప్టైడ్), జీఎల్‌పీ-1 (గ్లూకోన్ లైక్ పెప్టైడ్-1) అనే హార్మోన్ గ్రాహకాలను ఉత్తేజితం చేస్తుంది. తద్వారా మధుమేహం, ఊబకాయం, అధిక బరువును అదుపులో ఉంచుతుంది. క్లినికల్ ట్రయల్‌లో భాగంగా.. ఆహార నియంత్రణ పాటిస్తూ, వ్యాయామం చేస్తూ ఈ ఔషధాన్ని వారానికి 15 మిల్లీ గ్రాముల చొప్పు తీసుకున్న వారు 72 వారాల వ్యవధిలో సగటున 21.8 కిలోల బరువు తగ్గారు. 5ఎంజీ తీసుకున్న వారు సగటున 15.4 కిలోల బరువు తగ్గారు. మన దేశంలో ఈ ఔషధం ధర 2.5 మిల్లీగ్రాముల వయల్‌కు రూ. 3,500, 5 మిల్లీ గ్రాముల వయల్ ధర రూ. 4,375 గా ఉంది.