Revanth Reddy: తిరుమల దర్శనాలకు ఏపీ వాళ్లను అడుక్కోవడం ఏమిటి?: రేవంత్‌రెడ్డి

- శ్రీవారి దర్శనం కోసం ఏపీ ప్రభుత్వాన్ని, టీటీడీ అధికారులను అడుక్కోవడమేంటన్న రేవంత్‌రెడ్డి
- వారికి టీటీడీ ఉంటే మనకు వైటీడీ ఉందన్న సీఎం
- తిరుమల వెళ్లి బతిమాలుకునే బదులు రాష్ట్రంలోని ఆలయాలకు వెళ్లాలని సూచన
తిరుమల దర్శనాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనం కోసం ప్రతిసారి ఏపీ ప్రభుత్వాన్ని, టీటీడీ అధికారులను అడుక్కోవడమేంటని ప్రశ్నించారు. వారికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఉంటే మనకు యాదగిరిగుట్ట దేవస్థానం (వైటీడీ) ఉందని అన్నారు. భద్రాచలంలో రాముడు మనకు లేడా? మనకేమైనా శివాలయాలు తక్కువ ఉన్నాయా? అని ప్రశ్నించారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో నిన్న నిర్వహించిన ‘ప్రజాపాలనలో కొలువుల పండుగ’ కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్‌రెడ్డి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పురపాలక శాఖల్లో కారుణ్య, కొత్త నియామకాలకు సంబంధించి 922 మందికి పత్రాలు అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తిరుమలకు వెళ్లి బతిమాలుకునే బదులు తెలంగాణలో ఉన్న ఆలయాలకు వెళ్లొచ్చని అన్నారు. తెలంగాణకు అద్భుతమైన సాంస్కృతిక వారసత్వం ఉందని, మన ప్రాంతాలను మనం అభివృద్ధి చేసుకోవాలని పేర్కొన్నారు. సిలికాన్ వ్యాలీనే ఇప్పుడు తెలంగాణ వైపు చూస్తోందని చెప్పారు. మెక్ డొనాల్డ్ కంపెనీ నిన్ననే రాష్ట్రానికి వచ్చిందని రేవంత్‌రెడ్డి తెలిపారు.